వసతి గృహాల్లో మెరుగైన వసతులు
భూపాలపల్లి: వసతి గృహాల్లోని విద్యార్థులు బాగా చదువుకోవడానికి అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతులు తదితర అంశాలపై ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ప్రణాళిక, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ, జ్యోతిబా పూలే సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపై అధికారులు అందచేసిన ప్రతిపాదనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు, సౌకర్యాలు కల్పనపై అందచేసిన ప్రతిపాదనలకు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, హైమస్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని వసతి గృహాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీలు క్రమం తప్పక ఆహార నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు క్రమం తప్పక వసతి గృహాల్లో మెనూ అమలును తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు వెలకట్టలేని సంపద అని వెల్లడించారు. విద్యార్థులకు తాజా ఆహారాన్ని పెట్టాలని సూచించారు. సౌకర్యాలు, మరమ్మతులు ప్రతిపాదనలు సీపీఓకు అందచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజేందర్, సీపీఓ బాబురావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు శైలజ, సునీత, గిరిజన సంక్షేమ శాఖ అకడమిక్ మోనిటర్ రాజరత్నం పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment