పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకం కింద జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ పాఠశాలలకు రూ.73,76,640 నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.49,29,356 ఖర్చు చేశారన్నారు. మిగిలిన నిధులతో నిర్దేశించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, కంపోస్ట్, స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణ, సోలార్ విద్యుత్, గ్రీన్ పాఠశాలలు, ఏకో పార్కు, చారిత్రక ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించాలన్నారు. డీఎస్సీ 2008లో ఎంపికై న అభ్యర్థులు జిల్లాలో 43 మంది ఉన్నారని, వారందరి విద్యార్హతలు పరిశీలించి పొరపాట్లుకు తావు లేకుండా పకడ్బందీగా నియామకాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల నమోదు ఆపార్ ప్రక్రియ 58 శాతం పూర్తయిందని, వంద శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఎఫ్‌ఏఓ కార్తీక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment