నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
తగ్గుతున్న భూగర్భజలాలు
● పెరుగుతున్న నీటి వినియోగం
● ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తున్న ఎండలు
మండలం డిసెంబర్ జనవరి
2024 2025
భూపాలపల్లి 6.35 7.20
చిట్యాల 3.81 4.76
గణపురం 5.59 6.74
కొత్తపల్లిగోరి 4.12 4.49
కాటారం 16.50 17.84
మహదేవపూర్ 11.5 11.40
మహాముత్తారం 2.86 3.22
మల్హర్ 8.28 9.31
మొగుళ్లపల్లి 4.73 6.12
పలిమెల 6.56 7.46
రేగొండ 3.51 4.56
టేకుమట్ల 4.14 4.43
భూపాలపల్లి రూరల్: యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎండలు సైతం ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తుండడంతో నెల రోజుల్లో దాదాపు ఒక మీటరు లోతుకు పడిపోయింది. వేసవిలో సాగునీటి అవసరాలు పెరిగితే భూగర్భ జలాలు పాతాళానికి చేరే అవకాశాలున్నాయి. జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఇప్పటికే 85,675 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
గణపురం సరస్సు కింద 2వేల ఎకరాలు, భీం ఘన్‌పూర్ చెరువు కింద 1,500 ఎకరాలలో పంటలు సాగవుతుండగా, బోర్లు, బావుల కింద 82,175 పైగా సాగవుతున్నట్లు అంచనా. దీనికితోడు 16,843 ఎకరాల్లో మొక్క జొన్న, ఉద్యాన పంటలు, కూరగాయలతో కలిపి మొత్తం 22,670 ఎకరాలు సాగు చేస్తున్నారు. వరికే నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్‌లో సాధారణ నీటిమట్టం 7.48 మీటర్లు కాగా, జనవరిలో 8.38 మీటర్లకు పడిపోయింది. దాదాపు ఒక మీటరు లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అది కూడా ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. తర్వాత వర్షాల జాడ కరువైంది. చాలా చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. గణపురం మండలంలో 1.15 మీటర్లు పడిపోగా కాటారం 1.35, మల్హర్ 1.03, మొగుళ్లపల్లి 1.39, రేగొండ 1.15 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది.
దంచికొడుతున్నాయి..
సాధారణంగా మార్చిలో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో 34.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా ఎండలు ముదరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎండలతో పంటలకు ఎంత నీరు అందించినా వెంటవెంటనే ఆరిపోతూనే ఉంది. ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ముందు నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పొట్ట దశకు వస్తుండగా, చాలా ప్రాంతాల్లో ఈ మధ్యే నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆ పంటకు ఇంకా రెండున్నర నెలలకు పైగా నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడే భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లలో ఊటలు తగ్గిపోతున్నాయి. ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పంటలు గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పొదుపుగా వాడుకోవాలి..
ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలమట్టం పడిపోతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఏ పంటకు ఎంత అవసరమో అంతమేర నీటినే వాడాలి.
– కె.శ్రీనివాస్‌రావు,
జిల్లా భూగర్భజల శాఖ అధికారి
నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
Comments
Please login to add a commentAdd a comment