కార్పొ‘రేట్’ వేట
భూపాలపల్లి అర్బన్: కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల కోసం ఇప్పటినుంచే వేట మొదలుపెట్టాయి. టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పీఆర్‌ఓలను రంగంలోకి దింపి విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకునేలా కార్యాచరణను ముమ్మరం చేశాయి. పాఠశాలల యాజమాన్యాలకు భారీగా ముడుపులు అందించి ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి తమ కళాశాలల్లో చదువు బాగుందని, ఇక్కడ చదవిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పీఆర్‌ఓల సందడి కనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పలు కార్పొరేట్ కళాశాలల గురించి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎయిమ్స్ సూపర్ 60, ఇంజనీరింగ్‌లో ఐఐఐటీలతో పాటు గ్రూప్స్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలల నుంచి వివరాల సేకరణ
కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల తరఫున పీఆర్‌ఓలకు ఏర్పాటు చేసుకున్నాయి. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు నజరానాలు ప్రకటించి, విద్యార్థుల వివరాలు సేకరించుకొని ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారో, వారు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్న విషయాలను ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పీఆర్‌ఓలకు నజరానాలు ఇచ్చి విద్యార్థుల వివరాలను సేకరించి ఆ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి తమ కళాశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు.
ఆదేశాలు బుట్టదాఖలు
వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఎవరూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. అయినా వాటిని బేఖాతరు చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్‌ఓలను రంగంలోకి దింపి విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఎన్నికలను ప్రచారానికి మించి ప్రచారం చేయిస్తున్నాయి.
అధికారులు చర్యలు
తీసుకోవాలి
కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో పీఆర్‌ఓలను నియమించుకొని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై నియంత్రణ చేయడం లేదు. ఆఫర్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి.
– పాండవుల తిరుపతి,
విద్యార్థి తండ్రి భూపాలపల్లి
రూ.10వేలు అడ్వాన్స్
ప్రైవేట్ కళాశాలల్లో సీట్ కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.10వేలను అడ్వాన్స్‌గా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కుడా సీట్ దొరకదేమోనన్న ఆతృత, ఫీజులో రాయితీ ఉంటుందో అన్నదానితో పీఆర్‌ఓలు వచ్చిన వెంటనే ఏ కళాశాల, బోధన ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకొని సీట్ బుక్ చేసుకుంటున్నారు. ఏసీ బుకింగ్ అయితే మరో రూ.10వేల నుంచి రూ.30వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది.
టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేట్ కళాశాలల అన్వేషణ
మెడికల్, ఇంజనీరింగ్ శిక్షణ
ఇస్తామని ఎర
ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక నజరానా
రహస్యంగా విద్యార్థుల వివరాల సేకరణ
పీఆర్‌ఓలను నియమించుకున్న సంస్థలు
కార్పొ‘రేట్’ వేట
Comments
Please login to add a commentAdd a comment