ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేధ బాంక్వెట్ హాల్‌లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్‌లాల్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment