రోజుకో చోట..
పలుగుల అటవీప్రాంతంలో పెద్దపులి..
కాటారం/కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామ అటవీప్రాంతంలో మంగళవారం పెద్దపులి కనిపించింది. పదిరోజులుగా పెద్దపులి కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్టవేసి అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి శివారులో ఓ రైతు పులి పాదముద్రలు(పగ్‌మార్క్) చూసి భయాందోళనకు గురయ్యాడు. మహదేవపూర్ మండలం అన్నారం, బీరాసాగర్, కుదురుపల్లి అడవిలో రెండు రోజులు సంచరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి మాత్రం కెమెరాల్లో చిక్కడం లేదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.
ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా..
నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు(ప్లగ్ మార్క్స్) గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దృష్టి సారించారు. మొదటి రోజు కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని అటవీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు, సిబ్బంది జల్లెజ పట్టారు. పులి ఆనవాళ్లు కానరాకపోవడంతో నస్తూర్‌పల్లి, వీరాపూర్, అన్నారం, బీరాసాగర్, మహదేవపూర్ అటవీప్రాంతాల్లో ఝెనిమల్ ట్రాకర్ నిపుణులతో కలిసి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బృందాలుగా విడిపోయి అటవీశాఖ అధికారులు పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ పులి ఎక్కడ కూడా ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా సంచరిస్తుంది.
భయాందోళనలో ప్రజలు..
పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు.
ఆందోళనకు గురికావద్దు..
పులి సంచారం పట్ల ప్రజలు, రైతులు ఆందోళనకు గురికావద్దని, కాటారం రేంజ్ అధికారిణి స్వాతి, అటవీశాఖ రేంజర్ రవికుమార్ తెలిపారు. రా త్రి సమయాల్లో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూ చించారు. పులి, పులి ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
10రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్ట
ట్రాకింగ్ కెమెరాలకు చిక్కని ౖటైగర్
అటవీశాఖ అధికారులకు ముప్పుతిప్పలు
గారెకుంటలో నీరుతాగి..
మంగళవారం ఏకంగా మహదేవపూర్ మండలం పలుగుల ఎస్సీకాలనీ పక్కన నీలగిరి వనంలో పులి సంచారం చేసింది. అదేగ్రామానికి చెందిన నిట్టూరి బాపు అనే రైతు ఎడ్లబండితో పత్తిచేనుకు వెళుతున్నాడు. కొంత దూరం నడిచిన ఎద్దులు ముందుకు నడిచేందుకు వెనుకడుగు వేశాయి. రైతు ఎద్దులను దబాయించినా ముందుకు సాగలేదు. దీంతో రైతు పరీక్షించి చూడడంతో ముందు పెద్దపులి నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో రైతు భయానికి గురై వెంటనే ఎడ్ల బండిని వెనుకకు తిప్పి ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పులికోసం చెట్టు, పుట్ట, వాగు, వంకల్లో ముమ్మరంగా అన్వేషించారు. గారెకుంట పొచమ్మ కుంట వద్ద పులి నీరుతాగి వెళ్లినట్లు పాదముద్రలను అధికారులు సేకరించారు. అక్కడి నుంచి కాళేశ్వరం వైపున నల్లవాగుకు చేరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
రోజుకో చోట..
Comments
Please login to add a commentAdd a comment