ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల విచారణ, స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. కేసుల దర్యాప్తులో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, నేర స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీటు దాఖలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు విజిబుల్ పోలిసింగ్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్రామ సందర్శనలు, పట్టణంలో వార్డుల సందర్శనలు పెంచాలన్నారు. స్థానికంగా ఉండే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని చెప్పారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మహిళల పట్ల జరిగే నేరాలపై వేగంగా స్పందించి న్యాయం చేయాలన్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌కు
ప్రాధాన్యత ఇవ్వాలి
ఎస్పీ కిరణ్ ఖరే
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
Comments
Please login to add a commentAdd a comment