బాబోయ్ పులి..
పాదముద్రలు పరిశీలిస్తున్న ఎనిమల్ ట్రాకింగ్ టీం సభ్యులు
కాళేశ్వరం: రెండు రోజులుగా పలుగుల గ్రామ శివారు అటవీప్రాంతాల్లో పెద్దపులి తలదాచుకుంది. మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలోని ఎస్సీకాలనీ సమీపంలోని నీలగిరి వనం వైపు ఉన్న గారెకుంట ఒర్రెలో ఆవాసం కో సం కలియతిరుగుతుంది. బుధవారం ఉదయం కుంట్లం వైపు ఇసుక క్వారీకి వెళ్తున్న ఓ లారీడ్రైవర్ నీలగిరి వనం నుంచి భయటికి వచ్చిన పెద్దపులిని రోడ్డుపై చూశాడు. తను చూసిన పులి పెద్ద ఎద్దులా ఉందని డ్రైవర్ చెప్పడంతో కొందరు యువకులు అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో ఎఫ్‌ఎస్‌ఓ ఆనంద్‌తోపాటు కవ్వాల్ ఎనిమల్ ట్రాకింగ్ టీం సభ్యుడు యోగి బృందం పాదముద్రలను పరిశీలించింది.
ఆరు ట్రాకింగ్ కెమెరాలు..
పెద్దపులి రోజుకో చోట సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు పులి పాదముద్రలను పరిశీలిస్తూ ట్రాకింగ్ టీంలతో అన్వేషిస్తున్నారు. మహదేవపూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీశాఖ ఉద్యోగులు సైతం గాలింపు చర్యలో పాల్గొంటున్నారు. మంగళవారం గారెకుంట పోచమ్మ ఒర్రె ప్రాంతంలో పులి నీరుతాగిన ఆనవాళ్లు లభించాయి. దీంతో పలుగుల, ఒర్రె ప్రాంతం, కుంట్లం, మద్దుపల్లి అడవిలో ఆరు ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మూడున్నరేళ్ల మగపులి..
పది రోజులుగా కాటారం, మహదేవపూర్ రేంజ్‌లో సంచరిస్తున్న పులి వయస్సు సుమారుగా మూడున్నరేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అది మగ పెద్దపులి అని అనుమానుస్తున్నారు. మ్యాన్‌ఈటర్ కాదని, త్వరలోనే సరిహద్దు దాటి భయటికి వెళ్తుందని చెబుతున్నారు. ఆవాసం కోసం చూస్తున్న పులి గోదావరి సరిహద్దుల్లోనే తచ్చాడుతోందంటున్నారు. 2022లో వచ్చిన పెద్దపులి కూడా అన్నారం వైపు నుంచి పలుగుల మీదుగా కుంట్లం వద్ద గోదావరి దాటిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
అటవీశాఖ మౌనం..
పదిరోజులుగా పెద్దపులి రెండు మండలాల్లోని రేంజ్‌లో తిరుగుతున్నా అటవీశాఖ అధికారులు మౌనంపాటిస్తున్నారు. వివరాలు వెల్లడించడానికి వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులు తెలుపుతారని దాటవేసే సమాధానం చెబుతున్నారు. అధికారులు అమర్చిన ట్రాకింగ్ కెమెరాలకు పులి చిక్కిందా..? లేదా? చిక్కినా భయటికి చెప్పడంలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయమై ఎఫ్‌ఎస్‌ఓ ఆనంద్‌ను సంప్రదించగా ఆరు కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. కెమెరాలకు చిక్కలేదన్నారు. పులి సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పులికి హాని కలిగించొద్దని పేర్కొన్నారు.
పలుగుల వద్ద రోడ్డుపై
లారీడ్రైవర్‌కు కనిపించిన పెద్దపులి
నాలుగు బృందాలతో
అటవీశాఖ గాలింపు
కవ్వాల్ ఎనిమల్ ట్రాకింగ్ టీంతో అన్వేషణ
బాబోయ్ పులి..
Comments
Please login to add a commentAdd a comment