భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1052 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవడం వలన కేసుల్లో ఇరుక్కొని నష్టాల పాలవుతారని అన్నారు. ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజీమార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని మనసులో నాటుకోవాలన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని తెలి పారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు విడ్ణువర్దన్‌రావు, ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూం కాలనీని పరిశీలించిన కమిషనర్
భూపాలపల్లి అర్బన్: వేశాలపల్లి సమీపంలోని డబుల్‌బెడ్‌రూం కాలనీని శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రతి రోజు శానిటేషన్ పనులు చేయిస్తానని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తిచేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సానిటరీ ఇన్‌స్పెక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
మహదేవపూర్‌కు ఫైర్‌స్టేషన్ మంజూరు
కాళేశ్వరం: జిల్లాలో మరో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలో మరో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్‌స్టేషన్ ఏర్పాటుతో 18మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫైర్‌స్టేషన్ ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూడాలి.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి రూ.25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీంతో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయన్నారు. సూచనలు, సలహాల కోసం 94935 52349 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
స్థల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలు, 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో టెంట్‌సిటీ నిర్మాణం కోసం తాత్కాలికంగా ఆరు ఎకరాల గుడిమాన్యం స్థలాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. ఆ స్థలంలో మిర్చిపంట ఉండడంతో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేశారు. టెంట్‌సిటీకి స్థలాన్ని కేటాయించగా.. త్వరలో టెంట్‌సిటీ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 30కిపైగా ఏసీ, నాన్‌ఏసీ గదుల మాదిరి టెంట్‌సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. వారివెంట ఈఓ మహేష్, సూపరింటెంటెండ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, నాగరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment