నేడు నీటి సరఫరా నిలిపివేత
భూపాలపల్లి అర్బన్: మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల నేపథ్యంలో నేడు(శనివారం) మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైపులైన్ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
ఇసుక అక్రమ రవాణా
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాళేశ్వరం గోదావరి నుంచి రెండు ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. ఇసుక అక్రమ రవాణా విషయమై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను ఫోన్‌లో సంప్రదించగా అనుమతులు లేవని సీజ్ చేసి కేసు పెడుతామని హెచ్చరించారు.
అర్చక పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసినట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, వయోపరిమితి విషయమై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సదరు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 5గంటల లోపు కాళేశ్వరం దేవస్థానం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అవగాహన కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జనరిక్ మందులు వాడటం వలన ప్రజలకు నష్టం ఉండదని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జన ఔషధ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. 50నుంచి 60శాతం తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జనరిక్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఉమాదేవి, ఫార్మసిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
చిట్యాల/రేగొండ: చిట్యాల, రేగొండ మండలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కన్నం కుమారస్వామి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నట్లు సెకండ్ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రేగొండ మండలంలో..
రేగొండ మండలంలో అక్రమంగా 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ షాఖాన్ తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పుట్ట జలంధర్, కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడేపాక గ్రామానికి చెందిన కక్కెర్ల సదానందం, చిట్యాల మండలం జూకల్ గ్రామానికి మొలూగురి గణేష్ రెండు వాహనాలలో 65 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నేడు నీటి సరఫరా నిలిపివేత
Comments
Please login to add a commentAdd a comment