వేగవంతంగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ
భూపాలపల్లి: ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేసే అంశంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో మున్సిపల్, పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఇంటి స్థలాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణకు జిల్లావ్యాప్తంగా 8,312 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడికి క్రమబద్ధీకరణ సమాచారం ఇవ్వాలని, సోమవారం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించి క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరులోగా ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి..
పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్‌లో మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుట, వేసవిలో మొక్కల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి వ్యర్ధాల సేకరణ జరగాలని ఆదేశించారు. వ్యర్ధాలు ఆరుబయట వేస్తే జరిమానాలు విధించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికెన్, చేపలు, మాంసం విక్రయించే వ్యాపారులు, నిత్యావసర సరుకులు విక్రయించే వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు చేయొద్దని నోటీసులు జారీ చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment