నారసింహుడికి సింహ వాహనసేవ
రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహ వాహన సేవలో మాడ వీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ మహేష్, కమిటీ సభ్యులు మల్లెబోయిన శ్రీధర్, ఆకుల రమేష్, మూల ఓంకార్, కనుకుంట్ల జోగేందర్, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు.
నేడు హనుమంత వాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.
కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు