‘ఎల్‌ఆర్‌ఎస్’కు ఆన్‌లైన్ కష్టాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) బాలారిష్టాలు దాటడం లేదు. ఈ క్రమబద్ధీకరణకు 25 శాతం మినహాయింపును ఉపయోగించుకోవాలనుకునే వారికి అవాంతరాలు తప్పడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తామనుకునే వారికి వెబ్‌సైట్ ఓపెన్‌కాక.. ఆన్‌లైన్ యాక్సెప్ట్ లభించక.. మున్సిపల్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి పోతున్నారు. ఈ వెబ్‌సైట్ అప్‌డేషన్‌కు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. దీంతో వారం, 10 రోజుల తర్వాత రమ్మని సిబ్బంది దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఫోన్లు చేసి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పి.. తీరా ఆఫీస్‌కు వెళ్తే ఆన్‌లైన్ పని చేయట్లేదని చెప్పడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు ఇచ్చిన 25 శాతం రాయితీ డెడ్‌లైన్ ఉపయోగించుకోవడం ఎలా అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
సాంకేతిక సమస్యలు ..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా పరిధి 9 మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020 సంవత్సరం 1,58,265 దరఖాస్తులు రాగా, పరిశీలన, ఆమోదం ఆగుతూ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక రాగా.. మొత్తంగా 2024 వరకు 18,357 అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించారు. ఇంకా 1,39,908 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో ఉండగా.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మళ్లీ ట్రాక్‌లో పడింది. ఈనెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం మినహాయింపు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. అయితే వెబ్‌సైట్ సరిగా ఓపెన్ కాక తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి..
● గ్రేటర్ వరంగల్‌లో 1,00,989 దరఖాస్తులకు గురువారం 35,007 మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని అధి కారులు సమచారం ఇవ్వగా.. రూ.5.87 కోట్లు చెల్లించి 746 దరఖాస్తులు క్లియర్ చేసుకున్నారు. మిగతా దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
● జనగామ మున్సిపాలిటీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్ కోసం 18,379 దరఖాస్తులు రాగా.. 7,127 అప్లికేషన్లకు అధికారులు ఆమోదించారు. అందులో 64 మంది రూ.26 లక్షలు చెల్లించారు. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నాయి.
● వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 5,421 దరఖాస్తులుండగా 1,565 మందికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 81 మంది రూ.41 లక్షలు చెల్లించారు.
● వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 522 దరఖాస్తులకు 187 ఆమోదించగా.. గురువారం నాటికి 13 మంది మాత్రమే ఫీజు చెల్లించగా రూ.6 లక్షల మేరకు ఆదాయం సమకూరింది.
● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 3,182 దరఖాస్తులకు 2,320 అప్లికేషన్లు ఆమోదించి సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 16 డాక్యుమెంట్లపై రూ.5 లక్షల చెల్లింపులు మాత్రమే జరిగాయి.
● మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో 872 దరఖాస్తులకు 652 ఓకే కాగా 25, మరిపెడ మున్సిపాలిటీలో 2,629 అప్లికేషన్లకు 1,278 ఆమోదించగా 29 మంది మాత్రమే రూ.11 లక్షలు చెల్లించారు. తొర్రూరు మున్సిపాలిటీలో 10,299 అప్లికేషన్లకు 4,722 ఆమోదించగా 71 మంది రూ.30 లక్షలు, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 12,201 దరఖాస్తులకు 2,522 మంది ఫీజు చెల్లించాల్సి ఉండగా 447 మంది రూ.2.07 కోట్లు చెల్లించారు.
● భూపాలపల్లి మున్సిపాలిటీలో 3,771 అప్లికేషన్లకు 2,234 ఆమోదించగా 127 మంది రూ.61 లక్షలు చెల్లించారు.
రాయితీని సద్వినియోగం
చేసుకోవాలి..
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాన్ని లేఅవుట్, నాన్ లేఅవుట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత శాఖల అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రెగ్యులరైజ్ చేసుకోవాలి.
– అశ్విని తానాజీ వాకడే,
కమిషనర్, జీడబ్ల్యూఎంసీ
కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
మున్సిపాలిటీ దరఖాస్తులు
గ్రేటర్ వరంగల్ 1,00,989
పరకాల 3,182
నర్సంపేట 5,421
వర్ధన్నపేట 522
మహబూబాబాద్ 12,201
డోర్నకల్ 872
మరిపెడ 2,629
తొర్రూరు 10,299
భూపాలపల్లి 3,771
జనగామ 18,379
25 శాతం మినహాయింపు ఈనెల 31 వరకే..
సతాయిస్తున్న వెబ్‌సైట్..
వినియోగదారుల్లో ఆందోళన
1,58,265 దరఖాస్తులు.. 18,357 ఆమోదం
వివిధ స్థాయిల్లో 1,39,908 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment