భౌతికశాస్త్రంలో దశావధానం
● ఉపాధ్యాయులను అబ్బురపరిచిన విద్యార్థి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం బాసిరి అన్నపూర్ణ అధ్యక్షతన భౌతికశాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు అనే అంశంపై విద్యార్థి నాంసాని అక్షయ చేసిన దశావధానం ఫిజిక్స్ ఉపాధ్యాయులను అబ్బురపరిచింది. గురువారం 9వ తరగతి విద్యార్థి అక్షయ ప్రశ్నకు జవాబు, సమాధానాలకు ప్రశ్నలను తయారు చేయడం.. ఇచ్చిన నాలుగు పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా ఒక కథను చెప్పడం.. పెన్ను పేపర్ ఉపయోగించకుండా గమన నియమాల ఆధారంగా ఇచ్చిన వివరాలతో సమస్యను పరిష్కరించడం మొదలగు పది అంశాలతో దశావధానం నిర్వహించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ మేధావులు నిర్వహించే అవధానాన్ని భౌతికశాస్త్రంలో చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంత అలవోకగా అవధానాన్ని చేసిన అక్షయకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. భౌతిక శాస్త్రంలో వినూత్న ప్రయోగం చేసిన గైడ్ టీచర్ దొరికల రాజేందర్‌ను అభినందించారు. అనంతరం విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భౌతికశాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు బిల్లా రఘునాథ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గంటా రాజబాపు, మడ్క మధు, వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment