రెండు సోలార్‌ ప్లాంట్లు | - | Sakshi
Sakshi News home page

రెండు సోలార్‌ ప్లాంట్లు

Published Sat, Mar 15 2025 1:46 AM | Last Updated on Sat, Mar 15 2025 1:45 AM

రెండు

రెండు సోలార్‌ ప్లాంట్లు

భూపాలపల్లి రూరల్‌: స్వయం సహాయక సంఘాల్లో(ఎన్‌హెచ్‌జీ) మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్‌ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలో సోలార్‌ (సౌర శక్తి) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో ఎనిమిది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. వాటికి సంబంధించిన డీపీఆర్‌ సిద్ధమవుతోంది.

ప్రభుత్వం ప్రత్యేక చేయూత

ఒక్కో ప్లాంటుకు రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను సంఘాలు 10శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం బ్యాంకుల ద్వారా అందజేయనుంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్‌ ఫండ్‌ (సీఐఎఫ్‌) నుంచి ప్రభుత్వమే ఆయా సంఘాలకు రుణ ప్రతిపాదికన వాటిని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేస్తున్నారు.

ఆర్థిక భారం తగ్గించేలా...

జిల్లాలో ప్రాజెక్టులు, కాల్వలు అంతగా లేకపోవడంతో వ్యవసాయ ఆధారితంగానే పంటల సాగు జరుగుతుంది. ఇందుకు యాసంగిలో సాగు చేసే రైతులు విద్యుత్‌ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు నీటినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్‌ సరఫరా ఉచితంగా అందజేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతినెలా రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతుంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూత నందించేలా సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే యూనిట్‌కు రూ.3.13 పైసల చొప్పున ప్ర భుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యు త్‌ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గనుండటంతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది.

తొలివిడతలో రెండు ఏర్పాటు

జిల్లాలో ఎనిమిది సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతగా రెండు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న గ్రామ సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశాం. ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ అందాల్సి ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తాం. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది.

– నరేష్‌, డీఆర్‌డీఓ

జిల్లాలో యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు

మహిళా సంఘాలకు సౌర శక్తి ప్లాంట్లు

స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి

రెండు ప్లాంట్లు ఇలా..

జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్‌ ప్లాంట్లను మొదటి విడతలో భూపాలపల్లి మండలం వజినపల్లి, మహాముత్తారం మండలకేంద్రంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆసక్తి, ఉత్సాహంగా పనిచేసే సమాఖ్య సంఘాలను ఎంపిక చేశారు. భూపాలపల్లి మండలం వజినపల్లిలో, మహాముత్తారం మండలకేంద్రంలో నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్‌డీఓ, విద్యుత్‌, రెడ్కో, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ (రిజిస్ట్రేషన్‌) నంబర్లను కేటాయించారు. ప్లాంట్‌ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్‌ వరకు ప్రత్యేకంగా విద్యుత్‌లైన్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు మళ్లించి రైతులకు అందజేయనున్నారు. 25 ఏళ్ల పాటు ప్రాజెక్ట్‌ నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ఏటా ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది.

రెండు సోలార్‌ ప్లాంట్లు 1
1/1

రెండు సోలార్‌ ప్లాంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement