
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగనున్నా యి. పుష్కరాల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో పనుల్లో వేగం పెరిగింది. కాగా, రూ.21కోట్ల వ్యయంతో దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, ఎన్పీడీసీఎల్‌లు పనులు ప్రా రంభించాయి. అధునాతనంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ నమూనా ఎఫ్‌ఆర్‌పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తున్నారు. ఫైబర్ విగ్రహం తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
విగ్రహం ఉద్ధేశం..
పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారాంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది.
పుష్కర ఘాట్‌కు రెయిలింగ్
సుమారు 86 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘాట్ తీరంలో రూ.కోటితో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం చుట్టూర వేదమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న విగ్రహం ఏప్రిల్ రెండో వారంలో కాళేశ్వరం చేరనుంది. విగ్రహం మెట్ల కింది భాగం, కుడి, ఎడమ వైపు మూడు భాగాల్లో రాతితో చెక్కిన నిర్మాణాలు చేపట్టనున్నారు. మూడు వైపులా రెయిలింగ్‌ను రాతితో కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. దీంతో పుష్కరఘాట్‌కు సరికొత్త శోభ సంతరించుకుంటుంది.
విస్తృత ప్రచారం..
మే 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు జరుగే సరస్వతి పుష్కరాలకు రూ.20 లక్షలతో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ముఖ్యపట్టణా ల్లో హోర్డింగ్స్, వాల్‌పోస్టర్లు, మీడియా ద్వారా ప్రచారం చేపట్టనున్నారు. ఈప్రచార భాద్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వనున్నారని తెలిసింది. రూ.30 లక్షలతో పుష్కరాల 12 రోజుల కాశీ పండితులచే హారతిని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవికాకుండా టూరిజంశాఖ ద్వారా ఆరు ఎకరాల స్థలంలో 50–60కిపైగా టెన్‌సీటీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే స్థలాన్ని ఏర్పాటు చేశారు. టెన్‌సీటీ తాత్కాలిక నిర్మాణాలు 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల వరకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. టూరిజం శాఖ నిర్వహణ ఉంటుంది. త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
రూ.కోటితో సరస్వతీమాత
విగ్రహం, సుందరీకరణ
రూ.20లక్షలతో ఆహ్వానం పలికే ఫైబర్ విగ్రహం నిర్మాణం
12 రోజులపాటు కాశీ పండితులచే హారతి

సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’శోభ