
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య
కాటారం: ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు విద్య అందుతుందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి డీఈఓ రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. డీఈఓ, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, సీఎంఓ రమేశ్, జీసీడీఓ శైలజ, కిషన్‌రెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, హెచ్‌ఎం ఉమారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.