
ఆదాయ మార్గాలను పెంచుకోవాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చే అన్ని ఆదాయ మార్గాలను పెంచుకుంటూ సక్రమంగా సద్వినియోగం చేసుకొని పట్టణ అభివృద్ద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్‌హాల్‌లో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టణంలోని 30 వార్డుల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నూరు శాతం పన్ను వసూలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పట్టణాన్ని సుందరంగా, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసుకోవాలన్నారు. అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, గణేష్ చౌక్, మంజూర్ నగర్ సర్కిళ్ల విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. వేసవి దృష్ట్యా మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతి లేదని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
పకడ్బందీగా జాబ్‌మేళా ఏర్పాట్లు
భూపాలపల్లి రూరల్: ఈనెల 26న జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. జాబ్‌మేళా ఏర్పాట్లను గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు పది వేల నుంచి పదిహేను వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. జాబ్‌మేళాకు వచ్చే యువతీ, యువకులు ఇంటర్వ్యూలో పాల్గొనేలా సరిగా గైడ్ చేసేలా వాలంటీర్లను నియమించాలని సింగరేణి జీఎంను కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు రవాణా సదుపాయం, ఎండను దృష్టిలో పెట్టుకొని తాగునీరు, మజ్జిగ పాకెట్లు, భోజన వసతి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని జాబ్ మేళాను విజయవంతం చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు