
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కర పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పర్యవేక్షణ చేయలేకపోతే జిల్లా విడిచి వెళ్లాలని.. జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణకు ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ అధికారులుగా నియమించామని, ప్రతి రోజు పనులు పర్యవేక్షణ చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు చేయడం మన లక్ష్యమని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవగాహనకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యర్ధాలు నిర్వహణకు ఇన్సినినేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాలకు మెడికల్ క్యాంపులు
భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలలో ఏర్పాటు చేసే క్యాంపులు, సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు. ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్‌ను నియమించాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ వివరించారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం) ర్యాలీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారుల నియామకం
కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతినది పుష్కరాల పనులను వేగవంతం చేయడం కోసం కలెక్టర్ రాహుల్‌శర్మ పర్యవేక్షణకు గురువారం ప్రత్యేకాధికారులను నియమించారు. అధికారులు నిత్యం పనుల పురోగతిని సమీక్షించి, వాట్సాప్ గ్రూపుల్లో పనుల వివరాలు, ఫొటోలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాల్సి ఉంది.
కాళేశ్వరానికి ప్రపంచ సుందరీమణులు?
పుష్కరాలకు ప్రపంచ సుందరీమణులను ఆహ్వానించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఆలోచన చేసినట్లు సమాచారం. మే 14న ములుగు జిల్లా రామప్ప ఆలయానికి 30మంది ప్రపంచ సుందరీమణుల బృందం రానున్న షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో వారిని కాళేశ్వరాలయానికి ఆహ్వానించడానికి బుధవారం కాళేశ్వరంలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో చర్చకు వచ్చి ఆ శాఖ ఉన్నతాధికారి ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం.
కలెక్టర్ రాహుల్ శర్మ