
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పు న టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లా కు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు.
మే 20 టార్గెట్‌గా సమావేశాలు..
జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్‌లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్‌కు పొట్ల నాగేశ్వర్‌రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్‌కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్‌కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్లయ్య, కై లాష్‌లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది.
‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం
వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆదేశం
ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు
కొత్త అధ్యక్షులు
నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు..
ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి
కొత్తగా 20 మంది పేర్లు
అధ్యక్ష పదవి కోసం
పావులు కదుపుతున్న ఆశావహులు
డీసీసీ పీఠం కోసం పోటాపోటీ....
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీ కమిటీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్‌ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది.
వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజు, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది.
మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌నే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్‌చందర్‌రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్‌లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడి నిర్ణయం కీలకంగా కానుంది.