చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
రాజోళి: చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతోపాటు చేనేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ సిల్క్ బోర్డు ధర్మవరం సభ్యులు అవగాహన కల్పించారు. శుక్రవారం మండల కేంద్రం రాజోళిలోని చేనేత కార్మికులకు పలు అంశాలపై అవగాహన, శిక్షణ అందించారు. రంగులు అద్దకం, వాటిని వినియోగించే తీరు, రంగులు అద్దక ముందు, అద్దిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై కార్మికులకు స్పష్టత ఇచ్చారు. చేనేత కార్మికుల ఎదుట చేసిన ప్రత్యక్ష పరీక్షలు కార్మికులు ఆసక్తిగా తిలకించారు. చీర నాణ్యతను, మన్నికను నిర్ణయించే రంగుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 75 శాతం రాయితీతో మగ్గం సామగ్రి, కలర్ ఫ్యాక్టరీ యూనిట్లు అందిస్తారని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పలు రకాల చీరలు తయారు చేసే వారు ప్రత్యేకంగా కొన్ని జాగ్త్రలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దీపక్ సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు అశోక్ దేశాయ్,లోకేష్ పాల్గొన్నారు.
తల్లిదండ్రుల
ఆశయాలను నెరవేర్చాలి
గట్టు: తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను పిల్లలు తప్పక నెరవేర్చాలని ఇంటర్‌మీడియట్ విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాధికారి హృదయరాజు కోరారు. శుక్రవారం గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని వార్షిక పరీక్షలు మంచిగా రాయాలన్నారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్ మీడియట్ కీలకమన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా చదువుకున్న కళాశాలకు, పుట్టి పెరిగిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు కేఎస్‌డీ రాజు, రాజగోపాల్, రాఘవేంద్ర, రంగస్వామి విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment