బ్యాంకు పనిదినాలు ఐదు రోజులుగా మార్చాలి
గద్వాల న్యూటౌన్: వారంలో బ్యాంకు పనిదినాలు ఐదు రోజులుగా మార్చాలని యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంక్ మేయిన్‌బ్రాంచ్ వద్ద యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఇండియన్ బ్యాంక్‌లకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. బ్యాంకులకు ప్రతి వారంలో శని, ఆదివారాలను సెలవు దినాలుగా ప్రకటించి, ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా చేయాలన్నారు. ఈ డిమాండ్‌ను ఏడాది క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా, ఇంతవరకు స్పందించడం లేదన్నారు. ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 24, 25వ తేదీల్లో జాతీయ స్థాయి సమ్మెను నిర్వహించన్నుట్లు తెలిపారు. బ్యాంకులలో వివిధ విభాగాల్లో ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు రవికుమార్, ప్రభాకర్‌రెడ్డి, గిరీష్, సందీప్‌దినకరన్‌తో పాటు, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment