రైతు అభ్యున్నతికి కృషి
అయిజ: వ్యవసాయ సహకార సంఘాలు రైతు అభ్యున్నతికి కృషిచేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ పురుషోత్తంరావు అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించారు. ఈసందర్భంగా పురుషోత్తంరావు మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి కృషితో మహబూబ్‌నగర్ డీసీసీబీ నష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాట పట్టిందన్నారు. మరికొన్ని నూతన డీసీసీబీ బ్యాంక్‌లు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైందని అన్నారు. అయిజలో 2026 సంవత్సరంలో డీసీసీబీ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని, అయిజ పీఏసీఎస్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు నిధులు కేటాయించామని, అదేవిధంగా చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు క్యాష్ క్రెడిట్ నిధులు రూ.50 లక్షలు విడుదల చేసినట్లు పీఏసీఎస్ ప్రసిడెంట్ మధుసూదన్ రెడ్డికి తెలిపారు. ఏప్రిల్ మెదటి వారంలో ఈ రెండు స్కీంలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, గద్వాల బ్రాంచ్ మేనేజర్ ఆంజనేయులు, సొసైటీ కార్యదర్శి మల్లేష్, శ్రీనివస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఉపకులాలకు అన్యాయం చేయొద్దు
గద్వాల: ఎస్సీలో ఉన్న ఉప కులాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హోలియా దాసరి రామచంద్రుడు అన్నారు. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా 2024లో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సైతం తప్పుదారి పట్టిస్తూ కొందరు రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలిచ్చి కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉపకులాలకు తీరని అన్యాయం చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని ఎంతో వెనకబడిన ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,609
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు సోమవారం 965 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6609, కనిష్టం రూ.3699, సరాసరి రూ.5389 ధరలు పలికాయి. అలాగే, 126 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7019, కనిష్టం రూ.1926, సరాసరి రూ.7009 ధరలు వచ్చాయి. 44 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5819, కనిష్టం రూ. 3519, సరాసరి రూ. 5819 ధరలు లభించాయి.
రైతు అభ్యున్నతికి కృషి
Comments
Please login to add a commentAdd a comment