కొనసాగుతున్న అన్వేషణ
బురద, ఊట నీరే
ప్రధాన సమస్య
● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట
● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు
● పదోరోజు కొనసాగినసహాయక చర్యలు
● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం
అచ్చంపేట/ మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తున్నాయి. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది.
సహాయక చర్యలు వేగవంతం
సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్‌లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి.
కొనసాగుతున్న అన్వేషణ
Comments
Please login to add a commentAdd a comment