భూ బాగోతంపై విచారణకు ఆదేశం
గట్టు: గుట్టుగా ఐదెకరాల భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గట్టు మండలంలోని ఇందువాసి శివారులో ఐదెకరాల భూమిని అడ్డదారుల్లో వారసులు కాని వారసులు రికార్డులను మార్చుకొని సొంతం చేసుకునేందుకు యత్నించగా.. దీనిపై ‘ఐదెకరాల భూమికి టెండర్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. అసలు గట్టు రెవెన్యూ కార్యాలయంలో ఏం జరుగుతుందని, అక్రమాలకు ఎవరెవరు సహకరిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్ ఎవరు జారీ చేశారు, జారీ చేసే క్రమంలో కనీస విచారణ చేశారా లేదా అనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. జీవించి ఉన్న తల్లిదండ్రులను చనిపోయినట్లుగా నమ్మించిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్ సరిఫ్టికెట్‌ను రెవెన్యూ అధికారులు గుడ్డిగా ఎలా జారీ చేస్తారని, ఎవరి హయాంలో ఈ సరిఫ్టికెట్‌ను జారీ చేశారనే వివరాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలాఉండగా అసలు పట్టాదారుడైన ముత్తయ్య చాలా కాలం క్రితమే చనిపోయినప్పటికీ అతను 2019లో చనిపోయినట్లుగా చూపుతున్న మరణ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది అని తెలిసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని పోర్జరీ చేసి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లుగా తెలుస్తోంది. 2019లో ఇందువాసి కార్యదర్శిగా పని చేసిన వ్యక్తిని మరణ ధ్రువీకరణ పత్రం గురించి ప్రశ్నిస్తే.. అసలు ఆ సంతకం తనది కాదని, తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు వ్యక్తి తెలపడం గమనార్హం. మొత్తం మీద గట్టు భూ బాగోతం వ్యవహారంపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే దానిపై మండల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భూ బాగోతంపై విచారణకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment