సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నాళ్లయినా...ఎన్నేళ్లయినా...అభివృద్ధిలో పెద్దాయన అడుగు జాడలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. మాట అంటే చాలు ఎంత కష్టమైనా కడదాకా నిలిచే మనస్తత్వం మహానేత రాజశేఖరరెడ్డి సొంతం. ఆయన హయాంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఈ జిల్లాపై చూపించిన అభిమానానికి నిలువెత్తు నిదర్శనాలు. 1475 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు వైఎస్సార్ జిల్లా వాసులు బాధలను ప్రత్యక్షంగా చూశారు. తాను సీఎం అయ్యాక ఈ సమస్యలన్నింటిపైనా శ్రద్ధ చూపించారు.
నాడు చూపించిన పరిష్కార మార్గాలే ఇప్పటి తరానికి బాటలు వేశాయి. ముఖ్యంగా అన్నదాతల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కారానికి కృషి చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతు సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. నేడు(శనివారం) వైఎస్ వర్థంతి. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం ఆయన్ను మననం చేసుకుంటున్నారు.
రెండు పంటల స్థాయికి..
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఇప్పుడు రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుందంటే నాడు వైఎస్సార్ దార్శనికతే కారణం. ఆయన రూపకల్పన చేసిన నీటి ప్రాజెక్టులే ఇందుకు తార్కాణం. వైఎస్సార్ అధికారంలోకి రాక మునుపు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే గొప్ప. అలాంటిది ఆయన చూపిన దారితో రెండు పంటలు పండించే స్థితికి మెట్ట ప్రాంత భూములు చేరుకున్నాయి. ఇది మహానేత పుణ్యమే అంటారు ఇక్కడి రైతులు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలలో బీడు భూములలో బంగారం పండుతోందంటే అది వైఎస్ చలవే. అందుకే ఇన్నేళ్లయినా రైతులు వైఎస్సార్‌ను దైవంగా గుండెల్లో నింపుకున్నారు. సీఎం అయ్యాక తమ ప్రాంతం సుభిక్షమైందని చెబుతుంటారు.
మచ్చుకు కొన్ని ..
● మెట్ట ప్రాంత రైతులకు ఏళ్ల తరబడి సమస్య తోట వెంకటాచలం పుష్కర ఎత్తి పోతల పథకం. ఒకేసారి రూ.600కోట్లు వెచ్చించి లక్షన్నర ఎకరాల్లో సాగునీరందించడంలో మహానేత సఫలీకృతమయ్యారు.
● గత పాలకుల హామీకే పరిమితమైన తాండవ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.52 కోట్లతో ఆధునీకరించారు. కుడి,ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపించారు.
● రూ.120 కోట్లతో పిఠాపురం బ్రాంచ్ కెనాల్, రూ.132కోట్లతో ఏలేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టి రైతుల పక్షపాతిగా నిలిచారు.
● జంట మున్సిపాలిటీలు సామర్లకోట, పెద్దాపురం ప్రజల దాహార్తిని తీర్చి వారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు.రూ.15 కోట్లతో మంచినీటి ట్యాంకర్లు, రూ.12 కోట్లతో పెద్దాపురంలో రాజీవ్ గృహకల్ప, రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణంతో ప్రయోజనం పొందిన లబ్థిదారులు ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
● రూ.5 కోట్లతో తాండవపై మినీ అనకట్టలను నిర్మించి తమకు దాహం తీర్చిన దివంగత నేతను తుని ప్రజలు ఎప్పటికీ గుర్తు తెచ్చుకుంటున్నారు.
● ఎక్కడో రంపచోడవరం ఏజెన్సీలో ముసురుమిల్లి ప్రాజెక్టు నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించి గోకవరం మండల రైతుల కళ్లల్లో సంతోషాన్ని నింపారు. గోకవరం రైతుల కడగండ్లతో చలించిన వైఎస్ తాను సీఎం అయ్యాక రూ.205 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు వడివడిగా చేపట్టారు. ఈ మండల రైతులు వైఎస్‌ను ఇప్పటికీ స్మరించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment