ఇదేం రుబాబు పాలన?
● సర్వత్రా అరాచకమే..
● యథేచ్ఛగా శిలాఫలకాల కూల్చివేత
● ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం
● వైఎస్సార్ సీపీ శ్రేణులపై బెదిరింపులు
● టీడీపీ కూటమి పాలనపైప్రజల పెదవి విరుపు
అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, దాడులు, ప్రతిదాడులు అనే ఊసే గతంలో ఎప్పుడూ లేదు. ఎన్నికలు, పోలింగ్ వరకే రాజకీయాలు. ఆ తరువాత పార్టీ రహితంగా అన్నదమ్ముల్లా అందరూ కలసిమెలసే ఉంటారు. నిన్నమొన్నటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ ఇప్పుడా వాతావరణం మారి, సర్వత్రా అసహనం చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సుమారు పాతిక రోజుల కిందట టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని మునుపెన్నడూ లేని రీతిలో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వరుసగా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట దాడులు, విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి.
పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అంతమొందిస్తామంటూ ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. ఊరు విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇక శిలాఫలకాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం గురించి చెప్పనవసరమే లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ అభిమానించే మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను సైతం కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా చాలాచోట్ల పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుండటం విమర్శలకు తావిస్తోంది. కొత్తగా ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమోననే ఆశతో అధికారం కట్టబెడితే.. ఇలా విధ్వంసకర ఘటనలకు పాల్పడటమేమిటంటూ.. పాలక పక్షాల నేతల తీరుపై దాదాపు అన్ని వర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా పని చేశారనే కక్షతో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్న తీరుపై సర్వత్రా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.
దాడులు చేస్తున్నారిలా..
● జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. వారి పేర్లున్నాయనే కక్షతో ఆ శిలాఫలకం ధ్వంసం చేశారు.
● ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజేశ్వరి, ఆమె భర్త, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు ఇంటిపై వరుసగా రెండుసార్లు నాటు బాంబులు, కోడిగ్రుడ్లు, గాజుసీసాలతో దాడికి పాల్పడి, భయానక వాతావరణం సృష్టించారు.
● మాజీ మంత్రి రోజాపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను ఖండించడమే పాపమన్నట్లు కాకినాడ సిటీలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన ఆలీషాపై టీడీపీ మద్దతుదారులు దాడికి ఒడిగట్టారు.
● పెద్దాపురం మండలం పులిమేశ్వరంలో రైతుభరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక సర్పంచ్ ఆకుల వీరబాబు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు.
● రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున మాజీ ఎంపీ మార్గని భరత్‌రామ్ కార్యాలయంలో ఆయన ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలు తెలుగు తమ్ముళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
● కడియంలో రైతుబజారుకు అనుబంధంగా రైతుల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న షెడ్డును సైతం తెలుగు తమ్ముళ్లు వెనుక ఉండి అధికారులతో కూల్చివేయించారు. దీనిని గిరజాల బాబు ఆధ్వర్యాన అడ్డుకోగా అక్రమంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు.
● రాజానగరం మండలం రాధేయపాలెంలో కూటమి నేతలు విజయోత్సవ ర్యాలీలో సర్పంచ్ దుర్గ భర్త శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు.
● కొవ్వూరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంపై దాడి చేసి, కార్ల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. అనంతరం మెప్మా కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
● నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామ సచివాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని, శెట్టిపేట సొసైటీ భవన నిర్మాణ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని, సమిశ్రగూడెం గీతా మందిరం వద్ద సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
● గోపాలపురం – గుడ్డిగూడెం రోడ్డు శంకుస్థాపన శిలాఫలకాన్ని, చిట్యాలలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు.
● అమలాపురం చెన్నమల్లేశ్వరస్వామి దేవస్థానం వద్ద సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని, విలసవల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న 5 రోడ్లకు సంబంధించిన 5 శిలాఫలకాలను కూడా ధ్వంసం చేశారు. రెడ్డిపల్లి గ్రామ సచివాలయం వద్ద గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వసం చేశారు.
● మండపేట విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ సమీపాన ఇటీవల ఆవిష్కరించిన రహదారి ప్రారంభ శిలాఫలకాన్ని ధ్వంసం చేసి, అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోలను పగులగొట్టారు. అక్కడితో ఆగని తమ్ముళ్లు వారం తిరగకుండా మరో రెండు శిలాఫలకాలను పగులగొట్టారు. జెండా స్థూపాన్ని జేసీబీతో మురికి కాలువలోకి తోసేశారు. ఈ ఘటనలను వైఎస్సార్ సీపీ నేతలు ఖండించగా, వైఎస్సార్‌సీపీ నేతలే ధ్వంసం చేసి ఉంటారని తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశంలో అనడం పలువురిని నివ్వెరపరిచింది. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సైతం మీడియా సమావేశంలో జనం విస్తుపోయేలా ఎదురుదాడికి దిగడం గమనార్హం.
● రావులపాలెం మండలం కేతరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకురాలు లోవలక్ష్మిపై ఆ గ్రామ టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
● ఆత్రేయపురం మండలం పులిదిండిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ముండేల్లి నాగరాజుపై బీరు సీసాలతో దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు.
అనపర్తిలో.. అడ్డూ అదుపూ లేకుండా..
చంద్రబాబు ఆదేశాలతో సీటు కోసం చివరి నిమిషంలో టీడీపీ నుంచి బీజేపీ గూటికి చేరి, ఎమ్మెల్యే అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అనపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా దాడులు జరిగాయి. పలు గ్రామాల్లో పట్టపగలే తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై పడి ధ్వంసం చేయడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు. అనపర్తి ఉన్నత పాఠశాలలో బాలబాలికల రక్షణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.10.15 లక్షలతో నిర్మించిన ప్రహరీని సైతం ధ్వంసం చేశారు.
నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ప్రహరీని దగ్గరుండి మరీ కూల్చేయడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇంటికి వెళ్తున్న బలహీనవర్గాలకు చెందిన చెల్లుబోయిన కృష్ణ, అప్పన్నలపై అనపర్తి సావరం సెంటర్‌లో దారి కాచి కూటమి నేతలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. రామవరంలో నల్లమిల్లి సూర్రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు మూకదాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. వారం తిరగకుండానే దొరికిన వారిని దొరికినట్టు ఇనుపరాడ్లతో రక్తం వచ్చేటట్టు కొట్టారు. వరుస దాడులు, ఎమ్మెల్యే అనుచరుల నుంచి చంపేస్తామనే బెదిరింపులతో నల్లమిల్లి సూర్రెడ్డి ప్రాణభయంతో పరారయ్యారు.
ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రంగంపేట మండలం వడిశలేరులో కార్తి మార్తమ్మ ఇంటిపై మూక దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వారిని బయటకు లాగి మరీ మారణాయుధాలతో విధ్వంసం సృష్టించారు. పాత వీరంపాలెంలో టీడీపీకి చెందిన వి.నాగబాబు, సత్తిబాబులు.. గండి వెంకటేశ్వరరావు ఇంటిపై పడి ఆయనను బయటకు ఈడ్చుకుంటూ వచ్చి మరీ దాడి చేశారు. మహేంద్రవాడకు చెందిన మేడపాటి శివారెడ్డిని రామవరం హైస్కూల్ వద్ద దారి కాచి కర్రలు, కత్తులతో దాడికి పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రామవరానికి చెందిన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ఇంటిపై రెండు పర్యాయాలు దాడి చేసి, కిటికీ అద్దాలు పగులగొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఎమ్మెల్యే అనుచరగణం ఇలా వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
హింసకు స్వస్తి చెప్పాలి
రాజకీయాల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అధికార, ప్రతిపక్షాల శ్రేణులు క్రమశిక్షణగా ఉండాలంటే.. ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేయించేలా ఆయా పార్టీల అధినేతలు చొరవ తీసుకోవాలి. అధికార ప్రతిపక్షం ఏదైనా ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోటీ పడాలి. ప్రజల అభిమానాన్ని పెంచుకోవాలి. హింస, దౌర్జన్యం, దాడులు, కొట్లాటలు, దహనాలు, సోషల్ మీడియాలో ఆకతాయి పోస్టులకు స్వస్తి చెప్పాలి.
– దూసర్లపూడి రమణరాజు,సామాజికవేత్త, కాకినాడ
హామీలు అమలు చేయండి
కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం భావ్యం కాదు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పూర్తి సమయం అభివృద్ధిపై, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, ఇలా శిలాఫలకాల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడటం సరికాదు. అందరూ స్వాగతించేలా కొత్త ప్రభుత్వం ఆలోచనలు, పరిపాలన ఉండాలే తప్ప, ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు.
– రేవు తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,పీడీఎస్‌యూ, అమలాపురం
దాడుల సంస్కృతి మంచిది కాదు
ఎన్నికల్లో విజయం సాధించిన వారు ఓడిపోయిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు. ఏ పోటీలో అయినా ఒకరే విజయం సాధిస్తారు. గెలుపు ఓటములు సర్వసాధారణం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేలు చేసే పని కోసం ఉపయోగించాలి. అధికారంలోకి వచ్చిన వారు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కొనసాగించాలి. దాడుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి.
– నూతలపాటి అప్పలకొండ, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు,సామర్లకోట
ఉపేక్షించేది లేదు
ప్రజలిచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు. దాడులు, కొట్లాటలు, హింసకు పాల్పడటం, దహనం చేయడం, విగ్రహాలు కూల్చడం వంటి చర్యలకు ఒడిగట్టడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక పనులు చేయడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. చెడు ధోరణి ప్రబలకుండా, అసాంఘిక వ్యవస్థ పెరగకుండా పోలీసు వ్యవస్థ న్యాయసూత్రాలను పాటిస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ముందుముందు ఇలానే దాడులు కొనసాగితే ఉపేక్షించేది లేదు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది.
– కురసాల కన్నబాబు,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment