రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మంటపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నేడు సత్యదేవుని ప్రాకార సేవ
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువస్తారు. అక్కడ తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేసిననంతరం ఊరేగింపు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment