
పాదగయపై ఆధిపైత్యం
పాదగయ క్షేత్రం
● కూటమిలో కుమ్ములాటలు
● దేవుడు సాక్షిగా పెత్తనానికి పోరు
● శివరాత్రి ఉత్సవాలపై రాజకీయ క్రీనీడలు
పిఠాపురం: ‘దేవుడైతే మాకేంటి.. ఆయన పెళ్లయినా మేమే చేయాలి’ అంటూ పై చేయి కోసం, పెత్తనం కోసం కూటమి నేతలు పరస్పరం కుమ్ములాడుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి సందర్భంలోనూ ఆధిపత్య పోరుకు తెర తీస్తున్న టీడీపీ, జనసేన నేతలు.. ఇప్పుడు మహా శివరాత్రి ఉత్సవాలకు సైతం అదే తరహా పోరుకు తెర లేపుతున్నారు. షరా మామూలుగానే గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో తాము గెలిచాం కాబట్టి శివరాత్రి ఉత్సవాలపై పెత్తనం తమకే దక్కాలని జనసేన నేతలు.. తమ మద్దతుతోనే గెలిచారు కాబట్టి తమకే ఆధిపత్యం కావాలని టీడీపీ నేతలు కుమ్ములాటలు ప్రారంభించారు.
కమీషన్ల కక్కుర్తితో..
జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం పిఠాపురం పాదగయలో ఈ నెల 24 నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బారికేడ్లు, విద్యుద్దీపాలంకరణ వంటివి ఏర్పాటు చేయాలి. అలాగే, పారిశుధ్య పనులు ప్రత్యేకంగా నిర్వహించాలి. వీటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ పనులు దక్కించుకున్న వారు ఆయా నాయకులకు కమీషన్లు కూడా దండిగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై పెత్తనం కోసం కూటమి నేతల మధ్య కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి ప్రత్యేక దర్శనానికి కొంత మందికి ఉచితంగా టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు తమ వారికి ఇచ్చుకోవాలని కొంత మంది.. తమ నాయకులకు ఇవ్వడం ద్వారా వారి మెప్పు పొంది, తద్వారా ఏదో ఒక లబ్ధి పొందవచ్చని పలువురు ఆశిస్తున్నారు. ఇది కూడా ఆధిపత్య పోరుకు మరో కారణమవుతోంది. ఇలా శివరాత్రి ఉత్సవాల్లో తమకే ఆధిపత్యం కావాలంటూ టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకు వస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఎవరికి వారే.. తగ్గేదే లే..
ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా తమ చేతుల మీదుగానే శివరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని ఒకవైపు జనసేన పట్టు పడుతోంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా తగ్గేదే లే.. అన్నట్లు ఆధిపత్యం కోసం సై అంటున్నారు. ప్రస్తుతం ఉత్సవాల ఏర్పాట్లు చురుకుగా సాగుతూండగా.. వీటిపై పెత్తనం చెలాయించాలని కూటమి నేతలు చూడటం అధికారులకు తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పిఠాపురంలో నెగ్గింది జనసేన కాబట్టి అన్ని పనులూ తామే చేయాలని ఆ పార్టీ నేతలు కరాఖండీగా చెబుతున్నారు. తాము లేకపోతే జనసేన నెగ్గేదే కాదని, తమవల్లే ఆ పార్టీ గెలుపు సాధ్యమైందని, తాము లేకుండా ఇక్కడ జనసేన లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
కోడ్ సాకుతో..
పాదగయలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ భావించగా.. టీడీపీ, జనసేన నేతలు ఆధిపత్య పోరు సాగిస్తూండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి ఎవరి ప్రమేయమూ లేకుండా అధికారులతోనే ఉత్సవాలు జరిపించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అలా చేస్తే ఊరుకునేది లేదని, జనసేన నేతలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే తాము ఊరుకోబోమని, తమకూ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. చివరకు ఇది ఎటు దారి తీస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తంమీద లక్షలాది మంది భక్తులు వచ్చే పాదగయ మహా శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై రాజకీయ క్రీనీడలు పరచుకోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.. అభాసుపాలు
గత ఏడాది శ్రావణ మాసంలో పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించినప్పుడు వ్యవహరించిన తీరుతో జనసేన నేతలు అభాసు పాలయ్యారు. తమ పసుపు కుంకాలు కలకాలం నిలపాలని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వరలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. ఆ సందర్భంగా వారికి పంపిణీ చేసేందుకు 12 వేల చీరలు సిద్ధం చేశామని జనసేన నేతలు గొప్పలు చెప్పారు. తీరా చూస్తే సామాన్య భక్తులకు 600 టోకెన్లు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి జనసేన నేతలే పంచేసుకున్నారు. అమాయక మహిళలను చీరల కోసం గంటల తరబడి క్యూలో నిలబెట్టి చివరకు టోకెన్లు లేవు పొమ్మని చల్లగా చెప్పారు. అనంతరం టోకెన్లు తెచ్చుకున్నామంటూ కొంత మంది మహిళలు వచ్చినా చీరల కోసం వచ్చారంటూ చీదరించుకున్నారు. దీనిపై పలువురు మహిళలు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జనసేన నేతల తీరును దుయ్యబట్టారు. జనసేనలో కొందరు నాయకుల తీరుతో వ్రతం ఎపిసోడ్ అభాసుపాలైందనే విమర్శలు వచ్చాయి.

పాదగయపై ఆధిపైత్యం
Comments
Please login to add a commentAdd a comment