
రాష్ట్రంలో పోలీసు పాలన
●
● ప్రజాస్వామ్యాన్ని
అణగదొక్కుతున్నారు
● న్యాయ వ్యవస్థ అంటే లెక్క లేదు
● ప్రతిపక్షాలను అణచివేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
పిఠాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి, న్యాయ వ్యవస్థను లెక్క చేయకుండా, పోలీసు వ్యవస్థతో పాలన సాగిస్తూ, ప్రతిపక్షాలను అణచివేయడమే ధ్యేయంగా పని చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా నూతన అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పిఠాపురం సమన్వయకర్త వంగా గీత ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. దావోస్ వెళ్లినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాలేదని, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూసి భయపడటమే దీనికి కారణమని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, తొందరగా, తూతూమంత్రంగా పని పూర్తి చేయించి, అక్కడ తన పేరు వేయించుకోవాలనే చంద్రబాబు స్వార్థానికి కొన్ని జిల్లాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే తూర్పు గోదావరికే నీరివ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇక మిగిలిన జిల్లాలకు ఎలా అందుతుందని ప్రశ్నించారు. దీనిపై పోరాటానికి ఈ జిల్లా నుంచే సిద్ధమవుతామని ఆయన తెలిపారు.
వంశీ అరెస్టు అక్రమం
న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని రాజా అన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉన్న ఆయనకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆయనను ఎంత క్షోభకు గురి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని, ఇంట్లో ఆడవారికి కూడా విలువ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వ కుట్రలను ఛేదించుకుని వంశీ బయటకు వస్తారన్నారు.
వంద శాతం విజయమే లక్ష్యం
వైఎస్సార్ సీపీ 2029 ఎన్నికల్లో వంద శాతం విజయాలు నమోదు చేయడమే ధ్యేయంగా పని చేస్తానని రాజా చెప్పారు. వంగా గీత నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందన్నారు. తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే 2.0 పని తీరు కనబరుస్తానన్నారని, ఆయన బాటలోనే తామంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, కురసాల కన్నబాబు, వంగా గీత, దవులూరి దొరబాబు తదితర నాయకుల సూచనలు, సలహాలతో పార్టీని ముందుకు నడిపిస్తానన్నారు. అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు వేసి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. వైఎస్సార్ సీపీకి పోరాటాలు అలవాటేనని, న్యాయం కోసం, పార్టీ అభివృద్ధి కోసం పోరాడటంతో పాటు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రతి కార్యకర్తకూ తాను ప్రత్యక్షంగా అండగా ఉంటానని రాజా భరోసా ఇచ్చారు. వంగా గీత మాట్లాడుతూ, కేడర్‌ను కాపాడుకోవడంలో దాడిశెట్టి రాజాను మించిన నాయకుడు లేడని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఆయన కేడర్‌కు అండగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ పెద్దాపురం ఇన్‌చార్జ్ దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment