
కొత్త ఏజెన్సీకి పారిశుధ్య నిర్వహణ!
● రత్నగిరిపై వచ్చే నెల నుంచి అమలు
● అన్ని దేవాలయాలకూ కలిపి టెండర్ ఖరారుకు ప్రభుత్వం కాలయాపన
● అప్పటి వరకూ తాత్కాలిక ఏర్పాటు
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య నిర్వహణను వచ్చే నెల నుంచి కొత్త ఏజెన్సీకి తాత్కాలికంగా అప్పగించనున్నారు. అన్నవరం దేవస్థానంలో హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ ప్రస్తుతం పారిశధ్య పనులు నిర్వహిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తాము ఆ విధులు నిర్వహించలేమని ఆ సంస్థ దేవస్థానానికి లేఖ సమర్పించింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం విజయవాడలో కలిసి, పరిస్థితిని వివరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా దేవస్థానంలో శానిటరీ పనుల నిర్వహణకు గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్‌కు మార్చి 1 నుంచి తాత్కాలికంగా అప్పగించనున్నట్టు సమాచారం.
పాత రేటుకే పని చేయలేమని..
నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే అన్నవరం దేవస్థానంలో పారిశుధ్యం, సత్రాల్లో హౌస్ కీపింగ్, ఆలయ ప్రాంగణంలో శుభ్రత తదితర పనులు 24 గంటలూ నిరంతరాయంగా జరగాల్సి ఉంది. ఒక్క రోజు జరగకపోయినా భక్తులకు ఇబ్బంది తప్పదు. కేఎల్‌టీఎస్ సంస్ధ 2022 నవంబర్ 5న టెండర్ ద్వారా జీఎస్టీతో కలిపి నెలకు రూ.49 లక్షలకు ఈ పనులు దక్కించుకుంది. దీని గడువు గత నవంబర్ 5తో ముగిసింది. కొత్త టెండర్‌దారు వచ్చేంత వరకూ పని చేయాలన్న దేవస్థానం విజ్ఞప్తి మేరకు ఆ సంస్థ పాత టెండర్ రేటుకే ఈ పనులు నిర్వహిస్తోంది. పాత రేటు గిట్టుబాటు కానందున తాము మార్చి నుంచి పని చేయలేమని ఆ సంస్థ స్పష్టం చేసింది.
మూడు నెలలుగా జాప్యం
గతంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్ పిలిచేది. తక్కువకు కోట్ చేసిన ఏజెన్సీని ఖరారు చేసేవారు. అయితే గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలనూ కలిపి ఒకే యూనిట్‌గా శానిటరీ టెండర్ పిలవాలని నిర్ణయించారు. దీంతో దేవస్థానాల వారీగా టెండర్ పిలవకుండా నిలిపివేశారు. మూడు నెలలు గడిచినా దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. అన్నవరం దేవస్థానంలో కేఎల్‌టీఎస్ సంస్థ గడువు గత నవంబర్ 5న ముగిసినా మూడు నెలలుగా టెండర్లు పిలవకుండా జాప్యం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment