
సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
● అధికారులు, సిబ్బందికి డీఆర్వో ఆదేశం
● పోలింగ్ ప్రక్రియపై శిక్షణ
కాకినాడ సిటీ: ఈ నెల 27న జరిగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించాలని సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు ఆదేశించారు. ఆ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు(పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో), సెక్టార్ అధికారులకు కలెక్టరేట్‌లో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు, ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సామగ్రి, పంపిణీ కేంద్రాలు, పీవో డైరీ, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్ అకౌంటు, పోలింగ్ ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ల విధులు, ఫర్నిఛర్, విద్యుత్ తదితర అంశాలపై డీఆర్వో వెంకటరావు, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు అవగాహన కల్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారని, బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోని ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ వివరాలతో కూడిన ఫామ్‌లను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 70,540 మంది ఓటర్ల కోసం 21 మండలాల్లో 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పీవోలు 123 మంది, ఏపీవోలు 123 మంది, సెక్టార్ అధికారులు 21 మందిని నియమించామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కాకినాడ వివేకానంద హాలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూముకు సురక్షితంగా తరలించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్
కాకినాడ సిటీ: జిల్లాలో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తాగునీటి వనరులు శుభ్రపరచడం, కాలువల్లో, ఇతర ప్రాంతాల్లో చెత్త తొలగించే పనులు చేపట్టాలని సూచించారు. తడి – పొడి చెత్తపై ప్రజలకు శనివారం, సోమవారం కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment