లెక్క తప్పితే చిక్కులే
గత అనుభవాల రీత్యా ఏర్పాట్లు
గత మహా శివరాత్రి ఉత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీరిలో సుమారు 70 వేల మంది మాత్రమే దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. దానికి తగినట్లు పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించి చర్యలు చేపట్టాం. ఈ నెల 18న జిల్లా కలెక్టర్ సమీక్షలో పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాం.
– కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్,
ఈఓ, పాదగయ క్షేత్రం, పిఠాపురం
అధికారులే బాధ్యత వహించాలి
మహా శివరాత్రి నాడు పాదగయకు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తూంటారు. ఈ ఏడాది మహా శివరాత్రి బుధవారం మంచి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా కేవలం లక్షకు పైగా మాత్రమే భక్తులు వస్తారంటూ అధికారులు లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలా తక్కువ అంచనాలతో ఏర్పాట్లు చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జరగరాని సంఘటన జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– వెంకటేశ్వరరావు, విశ్వహిందూ
పరిషత్ నాయకుడు, పిఠాపురం
పిఠాపురం: దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా అమ్మవారు వెలసిన పుణ్యభూమి. దేశంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీ మాధవ స్వామి ఆలయం ఇక్కడే కొలువు తీరింది. సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం కూడా ఇదే. అంతే కాదు.. గయా క్షేత్రం కావడంతో ఇది పితృ కార్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన ఇక్కడి పాదగయ ఆలయానికి మహాశివరాత్రి పర్వదిన వేళ లక్షలాదిగా భక్తులు తరలి వస్తూంటారు. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడి అధికార యంత్రాంగం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే..
● పాదగయ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్‌డీ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా శివరాత్రికి లక్షకు పైగా మాత్రమే భక్తులు వస్తారని ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ చెప్పారు.
● వాస్తవానికి అధికారిక లెక్కల ప్రకారం పాదగయ క్షేత్రాన్ని ఏటా సుమారు 2 కోట్ల మంది భక్తులు దర్శిస్తారు. ఒక్క మహా శివరాత్రి పర్వదినం నాడే సుమారు 4 లక్షల మంది ఇక్కడి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కుక్కుటేశ్వరస్వామిని, ఇతర దేవతా మూర్తులను దర్శించుకుంటారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం శివరాత్రి ఉత్సవాలకు 2.50 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు.
● శివరాత్రి వేళ ఆలయానికి వచ్చిన భక్తుల్లో చాలా మంది పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లిపోతూంటారు. వచ్చిన భక్తుల్లో సగం మంది మాత్రమే దర్శనాలకు వస్తూంటారు. ఇలా ఆలయంలోకి వచ్చిన భక్తుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.
● శివరాత్రి రోజు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. గత అనుభవాలను బట్టి ఆ నాలుగు గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయి.
● దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా భక్తులు ఆలయం పరిసరాల్లోకి వచ్చి తీరుతారు. దీంతో క్యూలైన్లు నిండిపోతాయి. ఒక్కసారిగా వారి తాకిడి పెరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వారిని నిలువరించేంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అదే రోజు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం పోలీసులు శివరాత్రి ఉత్సవాల బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది.
● మరోవైపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం శివరాత్రి మర్నాడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్నికల బందోబస్తుకు వెళ్తారు.
● ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. కానీ, లక్షన్నర మందే వస్తారని ఈఓ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా భక్తుల లెక్కల్లో పొరబడితే, ఉత్సవాల ఏర్పాట్లపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ అంచనాలకు మించి భక్తులు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు లేక అధికార యంత్రాంగం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది.
శివరాత్రి ఏర్పాట్లపై పక్కాగా
దృష్టి పెట్టాల్సిందే
పాదగయకు ఏటా 4 లక్షల మంది రాక
లక్షన్నర మందే వస్తారంటున్న
ఆలయ అధికారులు
లెక్కల్లో పొరబడితే
తొక్కిసలాటకు ఆస్కారం
ముందుచూపుతో ఏర్పాట్లు
చేయాలంటున్న భక్తులు
18న కలెక్టర్ సమీక్ష
బ్రేక్ దర్శనమంటూ ఏర్పాట్లు
మహా శివరాత్రి నాడు వేకువజామున ఒంటి గంట నుంచే భక్తులు పుణ్యస్నానాలు ప్రారంభిస్తారు. మర్నాడు సాయంత్రం వరకూ వారి తాకిడి ఉంటుంది. ఒకేసారి లక్షల మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిని గుంపులు గుంపులుగా విడగొట్టి బ్రేక్ ఇచ్చి, స్నానాలకు వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలా చేస్తే తమ వంతు వచ్చేంత వరకూ ఆగే ఓపిక భక్తులకు ఉండదు. పాదగయ పరిసరాల్లో అంత ఖాళీ ప్రదే శం, పటిష్టమైన బారికేడ్లు ఉండే అవకాశమూ లేదు. అటువంటప్పుడు అధిక సంఖ్యలో భక్తులను ఆపి, వదిలే ఏర్పాట్లు చేస్తే అందరూ ఒక్కసారిగా పరుగు తీసే ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల మంజూరు సందర్భంగా పలువురి ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట వంటి దుర్ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలా కాకుండా వచ్చిన వారు వచ్చినట్టుగా పుష్కరిణి వద్దకు వెళ్లనిస్తే ఎంత మంది వచ్చినా తొక్కిసలాటకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాదగయలో గతంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలు ఎటువంటి తొక్కిసలాటా లేకుండా సాఫీగా జరిగాయి. ఈ నేపథ్యంలో భక్తులను ఆపాలనే ప్రయత్నంపై అధికారులు పునరాలోచించాలని పలువురు సూచిస్తున్నారు. పాదగయ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 18న సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ఈ అంశాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
లెక్క తప్పితే చిక్కులే
లెక్క తప్పితే చిక్కులే
Comments
Please login to add a commentAdd a comment