పిఠాపురం: దారిలో గాయాలతో ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు ఆగిన ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న నగదు దోపిడీ చేసిన ఘటన గొల్లప్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గొల్లప్రోలు దేవినగరానికి చెందిన ఉమ్మడి గంగాధర్ టైల్స్ పని చేసుకుని సురేష్ కల్యాణ మండపం మీదుగా దేవినగరంలోని తన ఇంటికి వెళుతున్నాడు. దారిలో అప్పటికే అక్కడ ఇరువర్గాలు కొట్లాడుకుంటుండగా, పిఠాపురం రథాలపేటకు చెందిన ఒక వ్యక్తికి గాయం అవడంతో మానవత్వంగా అతనికి సాయం చేయడానికి ఆగి నీరు అందిస్తున్నాడు. ఇంతలో పిఠాపురం రథాలపేటకు చెందిన పెద్ద, చిన్న, ఆకాష్ లతో పాటు గొల్లప్రోలుకు చెందిన గణేష్ ,అంజి బాధితుడు ఉమ్మడి గంగాధర్‌ను బలవంతంగా బండిమీద ఎక్కించుకుని పిఠాపురం రథాలపేట ఏరియాలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బీరు సీసాలతో, ఇనుపరాడ్లతో బాధితుడిపై దాడి చేసి గాయపరిచి అతని జేబులో ఉన్న రూ.3,800లను దోచుకున్నారు. అతనిని అదే రోజు రాత్రి మూడు గంటల సమయంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వదిలివేసి వెళ్లిపోయారు. గాయాలతో ఉన్న బాధితుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకుని జరిగిన విషయం బంధువులకు చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు ఆదివారం గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment