కనకధార కురవాలని! | - | Sakshi
Sakshi News home page

కనకధార కురవాలని!

Published Mon, Feb 17 2025 12:19 AM | Last Updated on Mon, Feb 17 2025 12:16 AM

కనకధా

కనకధార కురవాలని!

అన్నవరం: అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న అన్నవరం సత్యదేవునిపై ఎందువల్లనో కానీ కొంత కాలం నుంచి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు పూర్తి స్థాయిలో ప్రసరించడం లేదు. దీంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గత డిసెంబర్‌ 30న ‘లక్ష్మీ.. రావా.. రత్నగిరికి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావు దేవస్థానం ఆదాయం పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను, సిబ్బందిని కోరారు. దీనిపై ‘ఆదాయ మార్గాలు చెప్పండి’ శీర్షికన ‘సాక్షి’ జనవరి 28న వార్త ప్రచురించింది. కాగా, ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అనే రీతిలో ఉన్న దేవస్థానాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.

గత ఏడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఖర్చులు తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. మిగులు కూడా స్వల్పంగానే ఉంది. ఈ ప్రతిపాదనలను దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపించారు. గత బడ్జెట్‌లో రూ.కోటి మిగులుతుందని అంచనా వేయగా.. అదికాస్తా తలకిందులైంది. పైగా, అదనపు బడ్జెట్‌ కోసం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కాస్తయినా మిగులు చూపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదైనా అద్భుతం జరిగి, భక్తుల నుంచి దండిగా విరాళాలు, కానుకలు వస్తే మాత్రం దేవస్థానం ఆర్థికంగా ఒడ్డున పడుతుంది. ఆ మేరకు కనకధార కురిపించాలని సిరులమాతల్లి శ్రీమహాలక్ష్మిని అధికారులు వేడుకుంటున్నారు.

మిగులు స్వల్పమే..

మొత్తం రూ.162.55 కోట్లతో 2025–26 బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో వ్యయం రూ.162.13 కోట్లుగా పేర్కొన్నారు. తద్వారా రూ.42 లక్షలు మాత్రమే మిగులు చూపించారు. గత ఏడాది రూ.160 కోట్లతో బడ్జెట్‌ రూపొందించగా, వ్యయం రూ.159 కోట్లు, మిగులు రూ.కోటిగా అంచనా వేశారు. అయితే, అయితే అంచనాలకు మించి వ్యయం అవడంతో అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ దేవదాయ శాఖకు సప్లిమెంటరీ బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఇది దేవదాయ శాఖ కమిషనర్‌ పరిశీలనలో ఉంది.

భక్తుల సేవల్లో కుదింపు లేదు

నూతన బడ్జెట్‌లో కొన్ని వ్య యాల్లో కోత విధించాం. అ యినప్పటికీ భక్తులకు అందించే సేవల్లో మాత్రం ఎటు వంటి కోతలూ విధించలే దు. ఆ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇంజినీరింగ్‌ నిర్మాణాల విషయంలో కూడా ముందుగా నిర్ణయించినవన్నీ కొనసాగుతాయి.

– వీర్ల సుబ్బారావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

నిత్యాన్నదాన ట్రస్టుకు..

రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్టుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై రూ.12 కోట్ల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తుల భోజనాల ఖర్చు, ఆ విభాగం సిబ్బంది జీతభత్యాలకు చెల్లింపులు అంతే మొత్తంలో అవుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు.

గోసంరక్షణ ట్రస్ట్‌కు..

సత్యదేవ గో సంరక్షణ ట్రస్టులో డిపాజిట్లపై రూ.కోటి ఆదాయం వస్తూండగా ఆవుల మేత, ఇతర అవసరాలకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు.

ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ వ్యయాల్లో భారీ కోత

బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల వ్యయాల్లో భారీ కోత విధించారు. గత రెండేళ్లలో ఇంజినీరింగ్‌ విభాగంలో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో గత నవంబర్‌ నెలకే బడ్జెట్‌ కేటాయింపులు అయిపోయాయి. ఇంకా సుమారు రూ.3 కోట్లు చెల్లింపులు, చేపట్టాల్సిన పనులు మిగిలాయి. దీంతో వీటికి నిధులివ్వాలని సప్లిమెంటరీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎలక్ట్రికల్‌ విభాగానికి కూడా రూ.కోటి మాత్రమే కేటాయించారు.

పేరుకుపోయిన

సీజీఎఫ్‌ బకాయిలు

గత ఏడాది కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) చెల్లింపులు రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు, ఈ ఏడాది చెల్లింపులకు కలిపి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రూ.25 కోట్లు కేటాయించారు.

2025–26 బడ్జెట్‌ ప్రతిపాదనలు (రూ.కోట్లలో)

ఆదాయం

షాపుల లీజులు, లైసెన్సుల ఆదాయం 14.50

సత్రాల అద్దెలు 15.00

హుండీల కానుకలు 20.00

ప్రసాదం విక్రయాలు 40.00

వ్రతాల ఆదాయం 50.00

డిపాజిట్లపై వడ్డీ 6.00

ఇతర ఆదాయ వనరుల ద్వారా 17.00

వ్యయం

సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు 45.00

ముడిసరకుల కొనుగోళ్లు 35.00

ఉత్సవాల ఖర్చు 30.00

పారిశుధ్య విభాగం 8.00

ఇంజినీరింగ్‌ విభాగం 5.00

ఎలక్ట్రికల్‌ విభాగం 1.00

సీజీఎఫ్‌, ఆడిట్‌ ఫీజు వంటి చెల్లింపులు 25.00

ఇతర చెల్లింపులు 13.00

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ రూపకల్పన

రూ.162.55 కోట్లతో ప్రతిపాదనలు

ఆర్థిక ఇబ్బందుల ప్రభావం

ఖర్చుల్లో భారీగా కోత

వ్యయం అంచనా రూ.162.13 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
కనకధార కురవాలని!1
1/1

కనకధార కురవాలని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement