పడా.. ఏమిటో తేడా!
అలాగైతే ఉపయోగమేమిటి?
పడా వచ్చినా కౌడాలోనే పనులు చేయించుకోవాల్సి వస్తే పిఠాపురం ప్రజలకు పెద్దగా కలిసి వచ్చేదేముంటుంది? ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు వివిధ పనులపై కాకినాడలోని కౌడా కార్యాలయానికి వెళ్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందువలన పడా సేవలను విస్తృతపరచాలి.
– కొండేపూడి శంకరరావు, సామాజికవేత్త, పిఠాపురం
కొన్ని ఇబ్బందులు
మాత్రమే తగ్గుతాయి
పడా వల్ల కొన్ని ఇబ్బందులు మాత్రమే తగ్గుతాయి. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తే కౌడాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లోనే పూర్తవుతాయి. అయితే, పూర్తిగా అన్ని పనులూ పడా ద్వారా జరిగే అవకాశాల్లేవు.
– కనకారావు, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం
● జీఓ తప్ప నిధుల ఊసే లేదు
● అధికారుల అజమాయిషీయే అధికం
● ప్రజా వ్యతిరేకత చల్లార్చడానికేనని మిత్రపక్షం విమర్శ
పిఠాపురం: నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక హబ్‌గా అభివృద్ధి చేస్తానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీని అమలు కోసం ఒక అధికారిక వ్యవస్థ రూపొందిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పడా) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయించారు. అనంతరం ఒక ఐఏఎస్ అధికారితో పాటు 17 మంది సిబ్బందిని నియమిస్తూ మరో జీఓ ఇచ్చారు. పడా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు పడా వల్ల నియోజకవర్గానికి కలిగే లాభాలు ఏమిటనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. తన నియోజకవర్గానికి సంబంధించి కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటి ఏర్పాటు చేసుకున్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికే రూ.కోట్లు మంజూరు చేసుకున్నారు. పిఠాపురంలో మాత్రం పడా ఏర్పాటు జీఓలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ నయాపైసా నిధులు రాలేదు.
ఆయన రాని లోటు తీర్చడానికేనా..
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ పవన్ కల్యా ణ్ గత ఎనిమిది నెలల్లో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రజలకు ఎనిమిది రోజులు కూడా అందుబాటులో లేరు. ఇన్‌చార్జితో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో, పవన్ తీరుపై ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పడా ఏర్పాటు చేశారని మిత్రపక్షమైన టీడీపీ విమర్శిస్తోంది. అయితే, పవన్ ఇక నుంచి అధికారులతో పాలన సాగించనున్నారని, దీనివలన అభివృద్ధి జరుగుతుందని జనసేన వర్గీయులు చెప్పుకొంటున్నారు. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరితోనో పాలన చేయించడమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.
కౌడాదే పెత్తనం
ఇప్పటికే ఈ ప్రాంతమంతా కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కౌడా) పరిధిలో ఉంది. ఈ రీత్యా పడా అధికారాలు చాలా పరిమితంగానే ఉండనున్నా యి. దీనికి కౌడా స్థాయిలో అధికారాలు ఉండవని చెబుతున్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు కేంద్రం నుంచి నిధులు వస్తూంటాయి. కానీ పడాకు ఆ అవకాశం లేదని సంబంధిత జీఓ చెబుతోంది. కేవలం నియోజకవర్గానికి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పేదరిక నిర్మూలన చర్యలు, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వంటి వాటి వరకూ మాత్ర మే పడా అధికారాలు పరిమితమని అంటున్నారు. కౌ డా ఏర్పాటైనప్పటి నుంచీ పిఠాపురం ప్రాంత ప్రజలు ఇళ్లు, స్థలాలు, భూముల కన్వర్షన్లు, షాపుల వంటి అనుమతులను అక్కడే తీసుకుంటున్నారు. ఇప్పుడు పడా వచ్చినప్పటికీ ఈ పనులు మాత్రం కౌడా పరిధిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత రుసుములు ఆ సంస్థకే చెల్లించాలి. అంటే పిఠాపురం ప్రాంత ఆదాయం కూడా కౌడాకే వెళ్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి వివిధ రూపాల్లో కౌడాకు వస్తున్న నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అందిస్తూంటుంది. అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగుతుందని, అందువలన పడా వచ్చినా పెత్తనం కౌడా చేతిలోనే ఉంటుందని చెబుతున్నారు.
పడా.. ఏమిటో తేడా!
పడా.. ఏమిటో తేడా!
Comments
Please login to add a commentAdd a comment