● ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు
● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
33 మంది పోటీ
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం సమీపిస్తూండటంతో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా, ఇక 10 రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, వారి మద్దతుదార్లు ఆయా ఓటర్లను నేరుగా కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. కొంత మంది సాయంత్రం వేళ గెట్ టుగెదర్లు నిర్వహించి, భోజనాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి దిడ్ల వీర రాఘవులు, టీడీపీ మద్దతుతో పేరాబత్తుల రాజశేఖర్‌తో పాటు మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన యూటీఎఫ్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, ప్రజాసంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు పేరాబత్తుల రాజశేఖర్‌కు గట్టి సవాలే విసురుతున్నారు.
పీడీఎఫ్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తాము బలపరిచిన రాజశేఖర్ విజయం కోసం టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించింది. అంతేకాకుండా ప్రతి సచివాలయానికి ఒక ఇన్‌చార్జిని నియమించింది. అలాగే, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. సచివాలయానికి ఒకరిద్దరు చొప్పున నాయకులు, కార్యకర్తలను నియమించి ప్రచారం సాగిస్తున్నారు.
ప్రతి ఓటరును నాలుగైదుసార్లు కలిసి పోలింగ్ బూత్ వరకూ తీసుకువచ్చే బాధ్యతను వారికి అప్పజెప్పారు. ఇప్పటికే టీడీపీ నాయకులు ఓటర్ల జాబితా చేత పట్టుకుని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు ప్రతి పట్టభద్ర ఓటరునూ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సీపీఎం, సీఐటీయూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment