చెందుర్తిలో 4,500 కోళ్ల మృతి
● బర్డ్‌ఫ్లూగా అనుమానం
● శాంపిల్స్ సేకరణ
● అధికారులు అప్రమత్తం
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్‌లో ఒకేసారి 4,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో మండలానికి బర్డ్‌ఫ్లూ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వివరాలివీ.. చెందుర్తికి చెందిన బి.కృష్ణ కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఐబీ కంపెనీకి చెందిన కోళ్లను ఒక్కో బ్యాచ్‌లో 2,500 చొప్పున సుమారు 10 వేల కోళ్లు పెంచుతున్నాడు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా 1,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఆందోళనకు గురైన కృష్ణ చనిపోయిన కోళ్లను వెంటనే వేరు చేయడం ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయని అతడు చెప్పాడు. కోళ్ల మృతిపై సంబంధిత కంపెనీకి, పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఆ కంపెనీ సిబ్బంది వెంటనే వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. గొల్లప్రోలు పశు వైద్యాధికారి హిమజ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోళ్ల మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. అన్ని పరీక్షలూ నిర్వహించిన అనంతరం కోళ్ల మృతికి కారణాలను నిర్ధారిస్తామని హిమజ తెలిపారు. బర్డ్‌ఫ్లూపై అనుమానాలు వ్యక్తమవుతూండగా ఆ దిశగా కూడా అన్ని పరీక్షలూ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment