● తునిలో భారీగా బందోబస్తు
● ప్రతిష్టంభనకు నేటితో తెర!
తుని: మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక సోమవారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వైఎస్సార్ సీపీకి సంపూర్ణ మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ ఈ ఎన్నికకు టీడీపీ కూడా సమాయత్తమైంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రెండో వైస్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించారు. ఈ మేరకు అప్పట్లో వైఎస్సార్ సీపీకి చెందిన పామర్తి మహేష్ వైస్ చైర్మన్–2గా ఎన్నికయ్యారు. రెండేళ్ల అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి, ఎన్నిక జరగకుండా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించగా సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 15 రోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెర పడనుంది. ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను భయపెట్టి, ప్రలోభపెట్టి చేర్చుకున్న టీడీపీ.. వైస్ చైర్మన్–2 పదవికి పోటీ చేయనుంది. గతంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం కౌన్సిల్ సభ్యులు, మీడియాను మాత్రమే కౌన్సిల్ హాలులోనికి అనుమతిస్తామని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment