ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కొత్తపేట: ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాలపై సోమవారం ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు దాడులు చేశారు. కొంత కాలంగా పూతరేకులు తయారీలో నకిలీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్‌స్టెక్టర్లు గ్రామంలో పలు పూతరేకుల తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రొక్కయ్య, సుబ్బారావు, ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి టీమ్‌లు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయా కేంద్రాలు, దుకాణాల్లో పూతరేకులు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని, సీల్ ఫ్యాకెట్లను, ఇతర సరకులు, పరిసరాలు, పరిశుభ్రతను, షాపుల్లో పూతరేకులు, ఇతర తినుబండారాలను పరిశీలించారు. బ్రాండ్ నేమ్ లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లను గుర్తించారు. అలా ఒక తయారీ కేంద్రంలో 15 కిలోలు, మరో రెండు షాపుల్లో 142 కిలోల నెయ్యి ప్యాకెట్లు సీజ్ చేశారు. వీటికి సంబందించి 3 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 7 దుకాణాల్లో పూతరేకుల శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేని 10 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. తయారీ దారులు లూజ్ ప్యాకెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెయ్యినే వాడాలని చెబుతున్నామన్నారు. ప్రతి విక్రయదారుడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. తద్వారా నాణ్యమైన పూతరేకులు విక్రయించాలన్నారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రామంలో ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని షాపుల యజమానులు ఆ షాపులను మూసేశారు.
ఫ ఆత్రేయపురంలో పూతరేకుల
తయారీపై తనిఖీలు
ఫ ఏడు షాపుల్లో శాంపిల్స్ సేకరణ
Comments
Please login to add a commentAdd a comment