రోడ్డు ప్రమాదంలో తోడి కోడళ్లు మృతి
రాజానగరం: రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతేనేగానీ గడవని పరిస్థితిలో భర్తకు సాయంగా కూలికి పోతున్న తోడి కోడళ్లు రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి, ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మండలంలోని దివాన్‌చెరువులో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానవరానికి చెందిన కప్పల చంద్రమ్మ (51), కప్పల రిప్కో(55)లు తోడికోడళ్లు. రిప్కో భర్త నాగేశ్వరరావుతో కలసి వారిద్దరూ పాలచర్లలోని నర్సరీలో ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బైక్‌పై తిరిగి వస్తుండగా దివాన్‌చెరువులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కింద పడిన వారి పైనుంచి లారీ దూసుకుపోయింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చావులోనూ కలిసే..
తోడి కోడళ్లు అయిన చంద్రమ్మ, రిప్కోలు ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ల కంటే మిన్నగా కలిసి మెలసి ఉండేవారని, చివరికి మృత్యులోనూ కలిసే ఉన్నారని ప్రమాద దృశ్యాన్ని చూసిన కానవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం దూరంగా కూలికి వెళ్లి, కొద్దిసేపట్లోనే ఇళ్లకు చేరుకుంటారనుకునే లోపే మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది. చంద్రమ్మ భర్త గ్రామంలోనే మేకలను కాస్తుంటాడు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక రిప్కో భర్త నాగేశ్వరరావు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment