కాకినాడ క్రైం: రోగి నుంచి రూ.300 లంచం తీసుకున్న నేరంలో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి చర్యలు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల కిందట ఓ మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టమీ) కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఈ నెల 15న ఆమెకు ఆసుపత్రిలోని ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్‌లో ట్యూబెక్టమీ నిర్వహించారు. శస్త్రచికిత్స చేయడానికి ముందు ఆమెను చికిత్సకు సిద్ధం చేసేందుకు అక్కడ పనిచేస్తున్న రెగ్యులర్ ఎఫ్‌ఎన్‌ఓ మోర్తా వీరలక్ష్మి, కాంట్రాక్టు బేసిక్ ఎంఎన్‌ఓ సీహెచ్ రవితేజలు రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేయగా, వారికి పారిశుధ్య కార్మికురాలు మంగ సహకరించింది. శస్త్రచికిత్స ఒత్తిడిలో ఉన్న కుటుంబీకులు డబ్బులు తర్వాత ఇస్తామన్నా కనికరించలేదు. ఇస్తేనే సర్జరీకి సిద్ధం చేస్తామంటూ తేల్చి చెప్పారు. వారి ఒత్తిడితో అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వక తప్పలేదు. రూ.300 అందిన తర్వాతే శస్త్రచికిత్సకు సిద్ధం చేయించి ఆపరేషన్ థియేటర్లోకి పంపారు. వీరి నిర్వాకంతో మహిళ కుటుంబం ఎంతో ఆవేదన చెందింది. శస్త్రచికిత్స అనంతరం శనివారం మధ్యాహ్నం మహిళ కుటుంబ సభ్యులు జీజీహెచ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ కలెక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ బృందం ఫ్యామిలీ ప్లానింగ్ విభాగానికి వెళ్లి విచారణ చేపట్టింది. బాధితులతో పాటు మరికొందరు వీరు డబ్బులు డిమాండ్ చేయడం, శస్త్రచికిత్సకు ఆటంకం కలిగేలా రోగులను ఇబ్బందులకు గురి చేయడం నిజమేనని చెప్పారు. సాక్ష్యంగా రోగుల అటెండర్లు ఇందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లను అధికారులకు అందజేశారు. పకడ్బందీ ఆధారాల నేపథ్యంలో చర్యలు అనివార్యమయ్యారు. ఈ విచారణలో వెలుగుచూసిన అంశాలను డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారికి నివేదించారు. విచారణలోని వాస్తవాల ఆధారంగా లంచం తీసుకున్న మోర్తా వీరలక్ష్మి, సీహెచ్ రవితేజ, మంగలను సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఫ కాకినాడ జీజీహెచ్‌లో ఘటన
ఫ రోగి నుంచి లంచం
తీసుకోవడంతో చర్యలు
Comments
Please login to add a commentAdd a comment