వాయిదా మంత్రం | - | Sakshi
Sakshi News home page

వాయిదా మంత్రం

Published Tue, Feb 18 2025 12:26 AM | Last Updated on Tue, Feb 18 2025 12:22 AM

వాయిదా మంత్రం

వాయిదా మంత్రం

మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

కూటమి

కుతంత్రం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై న తుని మున్సిపల్‌ కౌన్సిలర్‌లను ప్రలోభాలకు గురిచేస్తోంది. జంటిల్‌మెన్‌ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌–2 పీఠాన్ని పోలీసులను కీలుబొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు. ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్‌చైర్‌పర్సన్‌ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్‌ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్‌లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్‌ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్‌ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్‌ పెట్టారు.

టీడీపీ కుట్రలను దీటుగా స్పందన

అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్‌లను కౌన్సిల్‌ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్‌ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్‌లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్‌ చైర్‌పర్సన్‌ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్‌ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్‌లను కిడ్నాప్‌ చేసైనా కౌన్సిల్‌లో కోరం సాధించి వైస్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధారాణి భర్త, కో–ఆప్షన్‌ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు. ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్‌ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొల్పింది. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్‌కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్‌హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్‌లు ఎవరూ వెళ్ల లేదు. తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కల్పిస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్‌ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి.

వైస్‌ చైర్‌పర్సన్‌ అందునా జంటిల్‌మెన్‌ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్‌ చైర్‌పర్సన్‌ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్‌ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్‌–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌, పీఏసీ చైర్మన్‌, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్‌ చైర్‌పర్సన్‌ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్‌లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్‌మీనాను కలెక్టర్‌ షన్మోహన్‌ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్‌ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్‌లు ఎవరైనా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

వైస్‌ చైర్‌పర్సన్‌ పీఠం కోసం దిగజారుడు

లేని అధికారం కోసం ప్రలోభాలు

టీడీపీ దౌర్జన్య రాజకీయాలు

యనమల ఇలాకాలో

అడ్డూ అదుపూ లేని అరాచకాలు

నేడు ‘చలో తుని’

వైఎస్సార్‌ సీపీ పిలుపు

ఉమ్మడి తూర్పున శ్రేణులు సమాయత్తం

కోరం లేక నేటికి వాయిదా : కలెక్టర్‌

ఎన్నిక పర్యవేక్షకుడిగా జేసీ మీనా

న్యాయం అడిగితే ఎదురు కేసులు

– మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై కేసు

తుని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలను నిలదీసినందుకు వైఎస్సార్‌ సీపీ నేతలపై ఎదురు కేసులు పెట్టారు. మూడు పర్యాయాలు అన్యాయంగా వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగకుండా శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కూటమి పెద్దలను వెనకేసుకొస్తూ పోలీసులు వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, అసాంఘిక శక్తులు దాడి చేస్తాయనే భయంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధారాణి ఇంటి వద్దే ఉన్న కౌన్సిలర్లకు ధైర్యం చెప్పేందుకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెళ్లారు. తుని పట్టణ పోలీసులు మాత్రం ఇందుకు విరుద్ధంగా కౌన్సిలర్లను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఒక కేసు, పోలిశెట్టి రామలింగేశ్వరావుపై దాడిచేశారంటూ మరో కేసు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీ అండతో తుని టౌన్‌ సీఐ ఎం.గీతారామకృష్ణ వ్యవహరించిన తీరును వైఎస్సార్‌ సీపీ నాయకులు ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement