జనసేన నేతలపై చార్జిషీటు నమోదు చేయని పోలీసులు
నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబం
కరప: ఫీల్డు అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నాలుగు నెలలైనా ఇంతవరకు బాధ్యులైన జనసేన పార్టీ నాయకులు ముగ్గురిపై చార్జిషీటు నమోదు చేయక పోవడంపై కరప మండలం పెనుగుదురు ఫీల్డుఅసిస్టెంట్ పులపకూర సునీత భర్త వీరబాబు సోమవారం ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు బండారు మురళి (మండల జనసేన పార్టీ అధ్యక్షుడు), ఘంటా నానిబాబు, వీరమహిళ గుబ్బలవీరవెంకటభవానీల వేధింపులు భరించలేక ఫీల్డు అసిస్టెంట్ సునీత గతేడాది అక్టోబర్ నెలలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు విదితమే. కాగా అధికారపార్టీ నాయకులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫీల్డు అసిస్టెంట్ భర్త వీరబాబు ఆరోపించారు. కరప పోలీసులు గతేడాది అక్టోబరు నెల 28వ తేదీన ముగ్గురు జనసేన నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. కాకినాడ డీఎస్పీ తన భార్య ఫీల్డుఅసిస్టెంట్ సునీత వాంగ్మూలాన్ని రికార్డు చేశారన్నారు. జరిగిన విషయాన్ని జడ్జి ఎదుట కూడా చెప్పామన్నారు. విచారణలో భాగంగా డీఎస్పీ మండల ఎస్సీ నాయకుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారన్నారు. ఎస్పీ కలుగచేసుకుని పెనగుదురు జనసేన పార్టీ నాయకులు ముగ్గురిపైన చార్జిషీటు దాఖలు చేయాలని కోరారు.
మహిళలకు భద్రత కరవు
తుని: సీఎం చందబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరవైందని తుని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిల్ హాలుకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంపై కలత చెందిన సుధారాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు పూర్తి స్థాయి విజయాన్ని అందించారని, ఒక్క సీటు లేని టీడీపీ వైస్ చైర్మన్ కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. రెండు గంటల పాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని, కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంగళవారం జరపనున్న ఎన్నికలో 17 మంది కౌన్సిల్ సభ్యులతో ఓటు వేయాలంటే జిల్లా ఎస్పీ, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి తీసుకువెళితే వెళతామని లేకపోతే వెళ్లబోమని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పచ్చపాతం చూపడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఓ మహిళ
ఆత్మహత్యాయత్నం
కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాకినాడ పట్టణానికి చెందిన మందపల్లి శ్రీదేవి వైఎస్సార్ ఫ్లై ఓవర్ విస్తరణలో భాగంగా తమ స్థలాలు పోయాయని భావించిన ప్రభుత్వం పక్కనే ఉన్న శ్మశాన భూమి, మరుగుదొడ్డిని పట్టాలుగా ఇచ్చిందని, ఆ భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె కలెక్టరేట్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా స్థలంపై ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఇప్పుడు పోలీసులతో వచ్చి ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. తమ కుటుంబాన్ని కాపాడాలని, లేదంటే కుటుంబం మొత్తం చనిపోయే పరిస్థితి ఉందని ఓ వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమటూ ఆమె పురుగుల మందు తాగారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.
జనసేన నేతలపై చార్జిషీటు నమోదు చేయని పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment