రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన
30 వేల మంది భక్తులు
● రూ.30 లక్షల ఆదాయం
● ముత్తంగి అలంకరణలో
దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు
అన్నవరం: వివాహాల సీజన్ సందర్భంగా నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలకు వివిధ ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో రద్దీ పెరిగింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు.
ముత్తంగి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారు
సోమవారం ముత్యాలతో చేసిన కవచాల (ముత్తంగి) అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరుడు భక్తులకు కనువిందు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment