ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి
కాకినాడ లీగల్: స్టాం్‌ప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా కె.ఆనందరావు వ్యక్తిగత కారణంగా 15 రోజులు సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న జె.జయ లక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
అన్నవరం ఆలయానికి
కోడ్ నుంచి మినహాయింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి.
అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు.
సజావుగా ఎమ్మెల్సీ పోలింగ్
కాకినాడ సిటీ: ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టార్, రూట్ అధికారులు సమర్థంగా పని చేయాలని ఏఆర్వో డీఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు మందిరంలో సెక్టార్, రూట్ అధికారులు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్వో జె వెంకటరావు హాజరై కాకినాడ, పెద్దాపురం ఆర్టీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణితో కలిసి అధికారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 21 సెక్టార్ అధికారులను నియమించామన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు
కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు.
నేడు పీఆర్‌జీ కాలేజీ
ప్రిన్సిపాల్‌పై విచారణ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం కళాశాలలో విచారణ చేపట్టనున్నారు. కళాశాలలకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు కళాశాల నిధులతో పాటు పరీక్ష విభాగంలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ విద్యా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. గత ఏడాది నవంబర్ 4న ఆర్‌జేడీ శోభారాణి కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేయగా సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ విచారణ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment