శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టరు షణ్మోహన్ అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం ఆయన స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గోదావరి కాలువలో భక్తులు స్నానాలు చేసే రేవు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించారు. ఆలయంలోనికి ప్రవేశించే క్యూ లైన్ల విధానాన్ని ఈఓ బళ్ల నీలకంఠంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐపీల పేరుతో ఘర్షణలకు దిగితే సహించేది లేదన్నారు. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గం నుంచి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను వ్యతిరేకిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులకు తాగునీరు అందే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్తు సరఫరా నిరంతరం ఉండాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులకు భోజనాలు పెట్టే దాతలకు ఒక ప్రదేశం కేటాయించాలన్నారు. మహాశివరాత్రి రోజున పోలీసుతో పాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందితో భక్తులకు సేవలందించే విధంగా చూడాలన్నారు. రథోత్సవం రోజున ఎమ్మెల్సీ పోలింగ్ ఉండటంతో అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా భారీ వాహనాలు పట్టణానికి దూరంగా నిలిపి వేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ దుర్గాభవానీ, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక సహయాధికారి ఎం. శ్రీహరిజగన్నాథ్, పెద్దాపురం అగ్నిమాపక అధికారి ప్రసాద్, డీఎస్పీ డి.శ్రీహరి రాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీఓ కె హిమామహేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment