తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?

Published Fri, Feb 21 2025 12:19 AM | Last Updated on Fri, Feb 21 2025 12:20 AM

తగిన

తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?

గండేపల్లి: ఏడీబీ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు జరుగుతున్న నష్టానికి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం తేల్చకుండా అధికారులు తమ ఇళ్లు, షాపులు కూల్చివేయడంపై మండిపడ్డారు. వివరాలివీ.. రాజానగరం – కాకినాడ ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో మండలంలోని సూరంపాలెం పరిధి రామేశంపేటలో ఇళ్లు, షాపుల కూల్చివేత ప్రారంభించారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. 64 గజాల స్థలం కోల్పోతున్న వారికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని, 130 గజాలు కోల్పోతున్న వారికి కూడా అంతే పరిహారం ఇవ్వడం ఎంతవరకూ న్యాయమని అధికారులను ప్రశ్నించారు. తమకు తగిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఏవిధంగా కూలగొడతారని నిలదీశారు. ఎక్కువ, తక్కువ తేడాలు గమనించకుండా అందరికీ ఒకేలా నష్టపరిహారం ఇవ్వడమేమిటని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దుకాణాలు, ఇళ్లల్లో విలువైన సామగ్రితో పాటు గృహోపకరణాలు కూడా ఉన్నాయని, కనీసం వాటిని తీసుకునేందుకై నా సమయం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ సీఎంకు చెప్పినా..

గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రామేశంపేటలో తమ సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, దీంతో పిఠాపురం వెళ్లి వివరించామని బాధితులు చెప్పారు. దీనిపై ఆయన అధికారులతో మాట్లాడతానన్నారని, ఇంతలోనే కూల్చివేతలు మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనికరించని అధికారులు

తమ ఇల్లు, దుకాణం కోల్పోతున్నామనే ఆందోళనతో స్థానిక మహిళ వరలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఇంట్లో వైద్యం చేయిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించి కూల్చివేత కొనసాగించారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఇంట్లో సిలైన్లు పెట్టినప్పటికీ అధికారులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారని వాపోయారు. అధికారులు అంత నిర్దయగా వ్యవహరిస్తే తామెలా బతకాలని ప్రశ్నించారు.

18 నిర్మాణాల కూల్చివేత

రామేశంపేటలో 18 నిర్మాణాలను కూల్చివేసినట్టు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వీరికి గతంలో నష్టపరిహారం ఇచ్చామని, అదనంగా ఇంటి స్థలం లేదా మరికొంత పరిహారం ఇస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు శుక్రవారం నుంచి కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్‌డీఓ శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం ఎస్సైలు యూవీ శివ నాగబాబు, టి.రఘునాథబాబు, సతీష్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఏడీబీ రోడ్డులో రామేశంపేట వద్ద నిర్మాణాల కూల్చివేత

ప్రస్తుత విలువ ప్రకారం పరిహారం

పెంచాలని బాధితుల డిమాండ్‌

ఆందోళనతో మహిళకు అస్వస్థత

ఇంట్లో వైద్యం జరుగుతున్నా

కూల్చివేత ఆపని అధికారులు

మండిపడిన స్థానికులు

No comments yet. Be the first to comment!
Add a comment
తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా? 1
1/1

తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement