ఐదేళ్లలో లబ్ధి పొందారిలా..
బోట్‌క్లబ్(కాకినాడసిటీ): ఖరీఫ్ ముగిసింది. పెట్టుబడిసాయం కోసం రైతులు ఎదురుచూశారు. కానీ నిధులు విడుదల కాలేదు. బయట వ్యాపారస్తుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి వచ్చిన పంటలు విక్రయించి అప్పులు తీర్చారు. ప్రస్తుతం రబీ సీజన్ మొదలై సుమారు నెలరోజులు కావస్తోంది. కానీ పెట్టుబడి సాయం మాత్రం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. ఇప్పటికే రైతులు పెట్టుబడుల కోసం బయట వ్యాపారస్తులు వద్ద అప్పులు చేసుకొని మరీ సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం తమ వాటా కింద రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఇప్పటికే రెండుసార్లు జమ చేసేంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక విడత కూడా వారి ఖాతాల్లో జమ చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నగదుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చంద్రబాబు సర్కార్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఇప్పుడే సాయం అవసరం
ప్రస్తుతం రబీలో రైతులు ఎరువులు వేసుకొనే అదను వచ్చింది. ప్రస్తుతం పొలాలు పిలక దశ నుంచి దుబ్బు దశకు చేరుకున్నాయి. ఎకరాకు రెండు, మూడు బస్తాలు ఎరువులు వేసుకోవాలి. ఎరువులు కొనుగోలు చేయాలంటే రూ.4 వేల నుంచి రూ.5 వేలు పైబడి పెట్టుబడి పెట్టాలి. దీనికితోడు వరిపైరుకు ఏదైనా తెగులు సోకితే అదనంగా పురుగుమందులు కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో రైతులకు పెట్టుబడి సహాయం ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సహాయం రైతులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
జగన్ హయాంలో అన్నదాతలకు ఆర్థిక భరోసా
ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గతంలో జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13, 500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు ఈ ఐదేళ్లలో కేవలం రైతు భరోసా ద్వారానే రూ.1,121 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
మూడు విడతల్లో సకాలంలో జమ
జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఇబ్బందులు లేకుండా వైఎస్సార్ రైతుల భరోసా సొమ్ము సకాలంలో ఖాతాల్లో జమ చేశారు. ఖరీప్ పంట వేసే ముందు ఏటా సరిగ్గా మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 జమ చేసేవారు. తర్వాత అక్టోబర్ నెలలో ఖరీప్ పంట కోతలతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండవ విడతలో రూ.4 వేలు జమ చేసేవారు. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ సమయంలో మరో రూ. 2 వేలు ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.13, 500 చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యేది. ఇలా ఐదేళ్లు ఏటా సకాలంలో రైతులను ఆదుకొంటూ వచ్చారు. కరోనా సమయంలో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ రైతు భరోసాతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇలా అనేక పథకాల ద్వారా గత ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది.
సాగుకు ముందు సాయమేది?
తాను అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఖరీఫ్ సాగుకు కేంద్రం నిధులు విడుదల చేయడంతో రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.20 వేలలో మొదటి విడతగా ఎంత జమ చేస్తుందో కూడా తెలియడం లేదు. దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
రబీలోనైనా వస్తుందా అని ఎదురుచూపు
గత ఏడాది జూన్ నెలలో ఖరీఫ్ సాగు చేసుకొన్న రైతులు మూడు నెలలు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూశారు. ఖరీఫ్ ముగిసింది. రబీ సీజన్ కూడా వచ్చింది. రైతులు ఇప్పటికే వరినాట్లు వేసుకోవడంతో పాటు పంట వేసకొని సుమారు 20 రోజుల నుంచి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విడత కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. చంద్రబాబు రైతులను గతంలో రుణమాఫీ పేరుతో ముంచాడని ప్రస్తుతం రైతులకు పెట్టుబడి సహాయం కూడా అలాగే చేసేలా ఉన్నారని ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ ముగిసి,
రబీ సీజన్ వచ్చినా అందని సాయం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
రెండు విడతలు రైతు ఖాతాల్లో జమ
ఇంకా విడుదల కాని
రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు
ఏటా రూ.20 వేలు ఇస్తానన్న
పెట్టుబడి సాయం ఏది?
జిల్లాలో 1.70 లక్షల మంది
అన్నదాతల ఎదురుచూపు
పెట్టుబడుల కోసం బయట
వ్యాపారస్తుల వద్ద అప్పులు
సంవత్సరం రైతుల లబ్ధి
సంఖ్య (రూ.కోట్లలో)
2019– 20 1,70,698 181.02
2020– 21 1,66,963 216. 22
2021– 22 1,62,125 214.43
2022–23 1,69,989 190.71
2023–24 1,74,229 250.36
పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారు
ఖరీఫ్‌లో ఇవ్వలేదు. ప్రస్తుతం రబీ సాగు మొదలు పెట్టి నెలరోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం అందలేదు. ప్రస్తుతం వరి పంటలకు ఎరువులు వేసుకోవాలి. కానీ డబ్బులు లేకపోవడంతో బయట అప్పులు తెచ్చుకొంటున్నాం. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలి.
– ఎల్లపు రామసూర్యసత్యనారాయణ, రైతు, బొడ్డవరం, కోటనందూరు మండలం
హామీ అమలు చేయాలి
అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. రబీ పనులు ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. బయట వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తున్నాం. పెట్టుబడి సాయం ఇస్తే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆసరాగా ఉంటుంది.
– ఎర్నీడి సత్తిరాజు, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం
ఐదేళ్లలో లబ్ధి పొందారిలా..
ఐదేళ్లలో లబ్ధి పొందారిలా..
ఐదేళ్లలో లబ్ధి పొందారిలా..
Comments
Please login to add a commentAdd a comment