కాకినాడ సిటీ: ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్) కార్యకలాపాలపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం వివరాలను ఏపీసీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జె.ఎలియాజర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం కింద పంటలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పుస్తకాలను అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 6,500 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం కింద రైతులు వరి సాగు చేస్తున్నారన్నారు. రానున్న ఖరీఫ్‌లో 73,834 ఎకరాల్లో వరి, మామిడి, జీడిమామిడి, పండ్లు, కూరగాయలు సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసి, మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏడీ మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ డీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment